Sunday, January 19, 2025

నా కుమారుడికి మరణ శిక్ష విధించండి: ఆర్జీకర్ కేసు దోషి తల్లి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా కోర్టు దోషిగా తేల్చడంతో, కోర్టు తీర్పుపై అతని తల్లి తాజాగా స్పందించారు. తన కుమారుడు చేసిన తప్పును ఓ మహిళగా ఎప్పటికీ క్షమించనని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వైద్యురాలు పడిన బాధను, నరకాన్ని తాను అర్థం చేసుకోగలనని ఆవేదన వ్యక్తం చేశారు. ’నా కొడుకు చనిపోతే నేను ఏడుస్తానేమో, కానీ ఓ అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరుకు సంజయ్‌కు జీవించే హక్కు లేదు. అతనికి మరణ శిక్ష విధించినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వైద్యురాలు నాకు కూతురితో సమానం.

కుమార్తెకు ఇటువంటి పరిస్థితి వస్తే ఏ తల్లీ ఊరుకోదు.’ అని అన్నారు. ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్తారా.? అని మీడియా అడిగిన ప్రశ్నకు సంజయ్ సోదరి అలాంటి ఉద్దేశం తమకు లేదని సమాధానం ఇచ్చారు. ’అతను ఇలాంటి దారుణానికి ఒడిగడతాడని తామెప్పుడూ అనుకోలేదు. అయితే, నేరం జరిగిన ప్రాంతంలో సంజయ్‌తో పాటు మరికొంతమంది ఉన్నట్లు కథనాలు వస్తున్నాయని.. ఈ విషయంపై పోలీసులు, సిబిఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేసి తగిన శిక్ష విధించాలి.’ అని కోరారు. ఈ కేసులో ముద్దాయికి ఎంతకాలం శిక్ష విధించబోయేదీ సోమవారం ప్రకటించనున్నట్లు కోల్ కతాలోని సియాల్దా అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి అనిర్బన్ దాస్ తెలిపారు.

31 ఏళ్ల వైద్యురాలి మృతదేహాన్ని గతేడాది ఆగస్ట్ 10న ఆస్పత్రి సమావేశ గదిలో గుర్తించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించారు. గోప్యంగా సాగిన విచారణలో ఇరుపక్షాల వాదనలు ఈ నెల 9న పూర్తయ్యాయి. వైద్యురాలిపై సంజయ్‌రాయ్ అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత గొంతు నులిమి హతమార్చినట్లు సిబిఐ రుజువు చేయగలిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఫిర్యాదులో మృతురాలి తండ్రి లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు 160 పేజీల తీర్పులో సమాధానం లభించనుందని చెప్పారు. పోలీసులు, ఆస్పత్రి వర్గాలు పాల్పడిన కొన్ని చర్యల్ని తాను తప్పుబట్టినట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది.

అందరినీ శిక్షించాలి : హతురాలి తల్లిదండ్రులు

మరోవైపు, తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్న కేసులో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళల పాత్ర ఉన్నట్లు వెల్లడైందని అధికారులు పేర్కొ న్నారని.. దారుణానికి పాల్పడిన మొత్తం అందరికీ కఠిన శిక్ష విధించాలని హతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. తమ విశ్వాసాన్ని న్యాయ వ్యవస్థ నిలబెట్టిందని కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, సంజయ్ రాయ్ ఒక్కడే ఈ నేరానికి పాల్పడలేదని సహ నిందితులనూ అరెస్ట్ చేసి శిక్షించాలన్నారు. దీనిపై తాము అవిశ్రాంతంగా పోరాడతామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News