రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా రేషన్ సరకులు పొందలేకపోతున్న సెక్స్ వర్కర్లను గుర్తించే ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ స్టేటస్ రిపోర్టులలో రాష్ట్రాలు అందచేసిన గణాంకాలు వాస్తవంగా లేవని, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(ఎన్‌ఎసిఓ) జాబితాపై ఆధారపడకుండా సెక్స్ వర్కర్ల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలను సంప్రదించి నివేదికలు తయారు చేయలని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఎన్‌ఎసిఓ, స్వచ్ఛంద సంస్థలు గుర్తించిన సెక్స్ వర్కర్లకు రేషన్ కార్డులతోపాటు ఓటర్ గుర్తింపు కార్డులు కూడా అందచేయాలని ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్రాలు తమ నివేదికలను మూడు వారాల్లో సమర్పించాలని ఆదేశిస్తూ గుర్తింపు కార్డు కోసం పట్టుపట్టకుండా సెక్స్ వర్కర్లకు రేషన్ సరకులు అందచేయాలని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.