నర్సంపేట: నర్సంపేట ఎమ్మెల్యేగా ఒక టర్మ్ అవకాశం ఇవ్వండి.. నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తానని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గంలో తనకు అవకాశం ఇస్తే ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మిస్తానని, మండల కేంద్రాల్లో మహిళా బ్యాంకులు ఏర్పాటుచేసి మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. అభివృద్ధి పనులు ప్రజల అవసరాన్ని బట్టి చేయాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పదేళ్లను పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తొలి, మలి దశ ఉద్యమంలో అమరులైన వారి ఆత్మ ఘోషిస్తుందన్నారు. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో స్వయం పరిపాలన అని ఆశించిన ప్రజలకు నేడు కుటుంబ పాలన కనిపిస్తుందన్నారు. మేడిగడ్డ, కాలేశ్వరం, సుందిళ్ల వాగు పేరుతో రూ. 5 లక్షల కోట్లు అప్పులుచేసి మెగా, నవయుగ కన్‌స్ట్రక్షన్లకు మేలు చేశారన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఉన్నాయని జూరాల టూ పాకాల నీటి తరలింపు హామీ అటకెక్కిందన్నారు.
ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్ధానాలను సిఎం కెసిఆర్.. చిన్న ముఖ్యమంత్రి హామీలకే పరిమితమవుతున్నారన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం ఓ పెద్ద మనిషి 22 ఎకరాలు ఇస్తే ఆ ఇళ్లు ప్రారంభించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేస్తానన్నారు. మా ముగ్గురిలో ఎవరు సమర్థులైతే వారినే ఎంచుకోమని ప్రజలను బహిరంగంగా కోరుతున్నానని, తనకు అవకాశం ఇస్తే నర్సంపేట రూపు రేఖలు మారుస్తానన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ వడ్డెపల్లి నర్సింహరాములు, పట్టణ అధ్యక్షుడు బాల్నె జగన్, మహిళా మోర్చా అధికార ప్రతినిధి, మాజీ సర్పంచ్ చిలువేరు రజనీభారతి, బిజెపి నాయకులు చిలువేరు రమేశ్, జూలూరి మనీష్, కూనమల్ల పృథ్వీరాజ్, రాము తదితరులు పాల్గొన్నారు.