ప్రభుత్వ రిటైర్డ్ పెన్షనర్ల సంఘం వినతి
హైదరాబాద్ : ప్రభుత్వ పెన్షనర్లకు 2022 జనవరి నుండి మొదటి విడత డిఆర్‌ను, అలాగే మరణించిన పెన్షనర్లకు దహన సంస్కారాల నిమిత్తం కనిష్ట సహాయంను రూ. 20 వేల నుండి 30 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ బడీచౌడీలోని తమ కార్యాలయంలో సంఘం అధ్యక్షులు జి. దామోదర్ రెడ్డి, సెక్రటరీ జనరల్ సి. చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 85 శాతం ప్రభుత్వ పెన్షనర్లు తమ సంఘంలో సభ్వత్వం కలిగి ఉన్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల కోసం రాష్ట్ర సంఘం భవన నిర్మాణానికి గాను ప్రభుత్వం స్థలం కేటాయించి భవన నిర్మాణమునకు నిధులు సమకూర్చాలని కోరుతున్నామన్నారు.
అలాగే పెండింగ్‌లో ఉన్న డిఆర్‌లను విడుదల చేయాలని కోరారు. పెన్షనర్ల కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు తగ్గించాలని, డెత్ రిలీఫ్ ఫండ్, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు , 2018 తరువాత పదవీ విరమణ పొందిన పెన్సనర్ల వివిధ రకాల పెన్షనరీ సదుపాయాల బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. పెన్షనర్ల అనారోగ్య సమస్యల నివారణకు గాను మూల్య పెన్షన్ నుండి 1 శాతం మినహాయించి పూర్తి స్థాయిలో ఈహెచ్‌ఎస్ వర్తింపజేయాలన్నారు.