మన తెలంగాణ/హైదరాబాద్ః రాష్ట్రంలో అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేస్తున్న బాలామృతం సహా పలు రకాల ఆహార పదార్థాల్లో నాణ్యతను పరీక్షించి ఆ ల్యాబ్ నివేదికను తనకు సమర్పించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి సరఫరా చేసే ఆహార పదార్థాల్లో నాణ్యతో పాటు శుభ్రత కూడా ఉండాలని అన్నారు. హైదరాబాద్‌లోని నాచారంలో ఉన్న తెలంగాణ ఫుడ్స్ కార్యాలయాన్ని, కర్మాగారాన్ని మంత్రి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న పలు ఆహార పదార్థాల ముడి సరుకులను, పరిసరాలను, యంత్రాలను, పరిశుభ్రతను నిశితంగా పరిశీలించారు. ఆహార పదార్థాల శుద్ధి ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించి పని విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
బాలామృతం పౌడర్ నాణ్యతను మంత్రి సీతక్క అక్కడికక్కడే తనిఖీ చేశారు. టీజీ ఫుడ్స్ ఫ్యాక్టరీ లో కలియ తిరుగుతూ, కార్మికులు సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. టీజీ ఫుడ్స్ విభాగాలను, యంత్రాల పనితీరును మంత్రికి అధికారులు, సిబ్బంది వివరించారు. మంత్రి వెంట టీజీ ఫుడ్స్ చైర్మన్ ఫాయిం, ఎండి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ శుద్ధిచేసిన ఆహార పదార్థాలను తక్షణం కవర్ చేసేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆహార పదార్థాలు, స్టోరేజ్ పాత్రలపై మేష్లు బిగించాలని, శుభ్రతను పాటించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ముడి సరుకుల నుంచి ప్యాకేజింగ్ వరకు మరింత శుభ్రత పాటించాలని మంత్రి ఆదేశించారు. అంగన్వాడీలకు ఇక్కడి నుంచి ఆహార పదార్థాలు సరఫరా అవుతున్నందున చిన్నారుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని శుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.
సాంకేతిక లోపంతో నెల రోజులుగా పని చేయని స్నాక్ ఫుడ్ యూనిట్ మరమ్మతులు చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అధికారులు సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న కొత్త యూనిట్లను సందర్శించారు. కొత్త యూనిట్ పనులు పదేళ్లుగా పూర్తికాకపోవడం పట్ల మంత్రి సీతక్క ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యంత్రాలను త్వరగా ఇన్స్టాల్ చేయాలని అదేశించారు. బడ్జెట్ వివరాలు, ఖర్చులు, ఇబ్బందులు, సమస్యలు, ఉన్నత స్థాయి సిబ్బంది అర్హత, అనుభవం, ఎంతకాలంగా టీజీ ఫుడ్స్‌లో ఏ స్థాయిలో పనిచేస్తున్నారు అనే సమగ్ర వివరాలను సిద్ధం చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. దీనికి అనుగుణంగా త్వరలో టీజీ ఫుడ్స్ పనితీరుపై సమీక్ష చేస్తానని తెలిపారు.