కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖను కోరిన కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ : రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖను కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. నమోదు చేసే అధికారాన్ని ఎన్నికల సంఘానికి ఇచ్చినప్పుడు రద్దు చేసే అధికారాన్ని కూడా ఇవ్వాలని అభిప్రాయపడింది. ఎన్నికల సంఘానికి ఈ అధికారాన్ని ఇస్తే అక్రమాలకు పాల్పడే రాజకీయ పార్టీలను నిరోధించవచ్చని పేర్కొంది. ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే కొందరు రాజకీయ పార్టీలను నమోదు చేసుకుంటున్నారని ఈసీ పేర్కొంది.
అందుకే అనేక పార్టీలు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకుంటున్నాయి కానీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని గుర్తు చేసింది. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చేటట్టు ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని కేంద్ర న్యాయమంత్రిత్వశాఖను ఎన్నికల సంఘం కోరింది. ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు, 50 కి పైగా ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందాయి. 2800 పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకున్నాయి. అడ్రస్ లేని 108 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.