Monday, January 20, 2025

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి : సిపిఐ నేత చాడ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ మగ్దూం భవన్ మంగళవారం జస్టీస్ చంద్ర కుమార్, ఓట్ నీట్ గ్యారంటీ సంస్థ అధ్యక్షురాలు సౌగ్రబేగం, తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి, సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఇ.టి.నరసింహ, ఎన్.బాలమల్లేష్ కలిసి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా నష్టపోతామని తెలిసినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ గతంలో కట్టిన నిజాం సాగర్, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు చెక్కుచెదరలేదన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరలాంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. కొత్తగూడెంలో పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివ రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పాశం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన దాసోజు వీరన్న, బెల్లి లలిత, గద్దర్ పేర్లను ఒక్కసారి కూడా ప్రభుత్వం గుర్తు చేయలేదన్నారు. సోనియా గాంధీ నిర్ణయంతో తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుకలా ఉండే సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివ రావును గెలిపించాలన్నారు. సౌగ్రా బేగం మాట్లాడుతూ కొత్తగూడెంలో సిపిఐని గెలిపించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News