Monday, December 23, 2024

గ్లకోమాకు ప్రధాన కారణాల్లో జన్యుచరిత్ర కీలకం

- Advertisement -
- Advertisement -

సర్వేంద్రియాల్లో నయనం ప్రధానం అన్నది మనకు తెలిసిందే. అన్ని ఇంద్రియాల కన్నా కంటి చూపు చాలా ముఖ్యం. కంటిచూపు లేకుంటే బ్రతుకే అంధకారం. అలాంటి కంటి దృష్టికి ఏవైనా సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దేశంలో శాశ్వత అంధత్వానికి దారితీసే ప్రధాన కారణాల్లో గ్లకోమా ఒకటి. గ్లకోమా అనేది కంటి ఆప్టిక్ నరాలు (దృశ్య సందేశాలను మెదడుకు తీసుకువెళ్లే ఒక మిలియన్ కంటే ఎక్కువ నరాలుతో కూడిన వ్యవస్థ) దెబ్బతినే పరిస్థితి. జన్యుపరమైన లోపాలవల్ల కూడా గ్లకోమా దాపురిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 4.5 మిలియన్ల మంది అంధత్వానికి ఇది కారణమని అంచనా. భారత దేశంలో గ్లకోమాతో బాధపడుతున్న 12 మిలియన్ మందిలో 1.2 మిలియన్ మంది ఇప్పటికే ఈ వ్యాధి వల్ల అంధత్వంతో అలమటిస్తున్నారు. ఇది దేశానికి ఆందోళన కలిగించే అంశంగా మారింది. దేశంలో కానీ ప్రపంచం మొత్తం మీద కానీ అంధత్వం దాపురించడానికి రెండోకారణం గ్లకోమాయే అవుతోంది.

ఎవరికైతే కుటుంబ చరిత్ర ఉందో వారు గ్లకోమా ముదిరిపోకముందే వైద్యులను సంప్రదించడమే కాదు,జన్యుపరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. మార్చి 12 నుంచి 18 వరకు గ్లకోమా ప్రపంచ అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్లకోమా గురించి ఎంతమందికి సరైన అవగాహన ఉందంటే చెప్పడం కష్టం. దేశంలో దాదాపు 13 మిలియన్ మంది గ్లకోమాతో బాధపడుతున్నప్పటికీ గ్లకోమా గురించి తెలిసిన వారి సంఖ్య అత్యంతస్వల్పంగా ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో ఈ సంఖ్య ఇంకా పెరిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. తక్షణం ఈ సమస్యను నివారించాలంటే ప్రజల్లో ఈ వ్యాధిపై అవగాహన పెంపొందించే ప్రయత్నం ముమ్మరంగా చేపట్టాలి. వ్యాధి ప్రారంభం లోనే గుర్తించాలి. వెంటనే చికిత్స ప్రారంభించాలి. అప్పుడే శాశ్వత అంధత్వం రాకుండా నివారించగలుగుతాం. న్యూఢిల్లీ ఎఎస్‌జి నారంగ్‌సెంటర్ గ్లకోమా సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ డెవెన్‌తులి దీనిపై కొన్ని సూచనలు చేశారు.

“గ్లకోమా అన్నది నయం కాని అంధత్వాన్ని కలిగించే అనేక రిస్కులతో కూడిన సంక్లిష్టవ్యాధి. అయితే పరిశోధనల ప్రకారం జన్యుపరమైన కారణాలు (genetics) గ్లకోమాకు దారి తీసే ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంటున్నాయి. ప్రారంభదశలో ఇది ఎటువంటి లక్షణాలను చూపించదు. శరీరానికి రక్తం ద్వారా పోషకాలు అందినట్టే కనుగుడ్డుకి ఆక్వియెస్ హ్యూమరీ ద్రవం ద్వారా పోషకాలు అందుతుంటాయి. పల్చగా, నీల్లను పోలి ఉండే ఈ ద్రవం కనుపాప, కార్నియాల మధ్య ప్రసరిస్తూ కంటిని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. రక్తం నుంచి తయారయ్యే ఈ ద్రవం కంట్లోకి వెళ్లి తిరిగి రక్తంలో కలిసిపోతుంది. ఈ ద్రవం పయనించే మార్గాన్ని యాంగిల్ అంటారు. ఈ మార్గంలో అడ్డంకులు ఏర్పడి ద్రవం కంట్లోనే నిల్చిపోతే కనుగుడ్డుపై ఒత్తిడి ( ఇంట్రాకోక్యులర్ ప్రెజర్) పెరిగి కంటి చూపుకు తోడ్పడే ఆప్టిక్ నెర్వ్ (optic nerve ) దెబ్బతింటుంది. మనం చూసే దృశ్యాల సంకేతాలను మెదడుకు పంపించేది ఆప్టిక్ నెర్వే. జన్యుపరమైన లోపాలతో దీర్ఘకాలిక క్రియాశీలక ఆప్టిక్ న్యూరోపతి అనే రుగ్మతగా మారి అంధత్వానికి దారి తీస్తుంది. అందువల్ల జన్యుపరమైన పరీక్షలు కంటికి చేయించుకోవాలని డాక్టర్ తులి సూచించారు.

వేగంగా దీన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే శాశ్వత అంధత్వాన్ని నివారించడమౌతుంది. ఇది చాలా నెమ్మదిగా పెరుగుతుంది. వ్యాధి తీవ్ర దశకు చేరుకునే వరకు వ్యాధి లక్షణాలు ఒకంతట బయటపడవు. ఎవరైతే 40 ఏళ్లుదాటి, కుటుంబ చరిత్ర కలిగి ఉంటే థైరాయిడ్, రక్తపోటు, ఉన్నట్టయితే గ్లకోమా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకనే గ్లకోమా ఉందా లేదా అన్నది నిర్ధారించుకోడానికి పరీక్షలు చేయించుకోవాలి. గ్లకోమాలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. ఒకటి ఓపెన్ యాంగిల్ గ్లకోమా, రెండోది క్లోజ్ యాంగిల్ గ్లకోమా. ఓపెన్ యాంగిల్ గ్లకోమా అత్యంత సాధారణ రూపం. ఇది అన్ని గ్లకోమా కేసుల్లో కనీసం 90 శాతం వరకు ఉంటుంది. ఇది చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఈ వ్యాధి గర్భస్థ శిశువు మొదలుకొని వృద్ధుల వరకు ఉంటుంది. ఒక కంట్లో, లేదా ఒకేసారి రెండు కళ్లల్లోనూ గ్లకోమా రావచ్చు. ప్రస్తుతం గ్లకోమా ముందస్తు రోగనిర్ధారణ, చికిత్స మరింత దృష్టిని కోల్పోకుండా నిరోధించడానికి మందులు, శస్త్రచికిత్సలు లేదా లేజర్ చికిత్సతో సాధ్యమవుతుంది. అలాగే ఇప్పటికే దృష్టి లోపం ఉంటే దాన్ని నివారించడానికి ప్రయత్నించ వచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News