Saturday, December 21, 2024

డచ్‌ను దంచి కొట్టారు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మూడో విజయం నమోదు చేసింది. బుధవారం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరును సాధించింది. మాక్స్‌వెల్ (106) విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించాడు. వార్నర్ కూడా సెంచరీతో అలరించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 21 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. ఆడమ్ జంపా 8 పరుగులకే నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. మార్ష్ రెండు వికెట్లు తీశాడు.

స్మిత్, వార్నర్ మెరుపులు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఆశించిన శుభారంభం లభించలేదు. ఓపెనర్ మిఛెల్ మార్ష్ (9) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన స్మిత్‌తో కలిసి మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీని విడగొట్టేందుకు నెదర్లాండ్స్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. ధాటిగా ఆడిన స్మిత్ 9 ఫోర్లు, సిక్సర్‌తో 71 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన లబుషేన్ కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. వార్నర్‌తో కలిసి స్కోరును పరిగెత్తించాడు. లబుషేన్ 7ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. మరోవైపు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ 93 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు.

మాక్స్‌వెల్ రికార్డు శతకం
కాగా, ఇన్నింగ్స్ చివర్లో గ్లెన్ మాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. నెదర్లాండ్స్ బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరును పరిగెత్తించాడు. అతన్ని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అసాధారణ ఇన్నింగ్స్‌తో అలరించిన మాక్స్‌వెల్ 40 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన బ్యాటర్‌గా కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. చారిత్రక బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న మాక్స్‌వెల్ 44 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, 9 ఫోర్లతో 106 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా రికార్డు స్కోరును నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News