Wednesday, January 22, 2025

ప్రపంచ పాలన పటిష్టపడాలి

- Advertisement -
- Advertisement -

ప్రపంచం ప్రమాదకర భౌగోళిక రాజకీయ మాంద్యంలోకి ప్రవేశిస్తోంది. ఆర్థిక వ్యవస్థ లాగే, భౌగోళిక రాజకీయంఎగుడు దిగుళ్ళలో ఉంది. కొవిడ్ విశ్వమహమ్మారితో సమస్య తీవ్రతరం, శీఘ్రతరం అయింది. ప్రపంచం పతన దిశలో ఉంది. విశ్వమహమ్మారితోనేకాక ఇతర కారణాలతోనూ దిశ మారింది. అర్థవంతమైన, నిర్మాణాత్మక మౌఖిక చర్చలకు, కలిసి పని చేయడానికి అవకాశాలు తగ్గాయి. సమీప భవిష్యత్తులో, భౌతిక సమావేశాలలో అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకోవచ్చని ఆశిద్దాం. ప్రపంచ ప్రధాన శక్తుల మధ్య సఖ్యత లేకుంటే ఏ సమస్యా పరిష్కారం కాదు. చైనా, అమెరికా, రష్యాలు చర్చించాలి. మిగతా దేశాలూ భిన్నాభిప్రాయాలను అధిగమించి పరస్పర సహకార మార్గాలను వెతకాలి. ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రపంచం సామరస్యపూర్వకంగా కలిసి పని చేయకుంటే, నేటి భౌగోళిక రాజకీయ మాంద్యం అన్ని దేశాలకు పెనుముప్పు కలిగిస్తుంది.
ప్రపంచవ్యాప్త శాంతి నిర్వహణలో ఐక్యరాజ్య సమితి (ఐరాస) సామర్థ్యాన్ని కొవిడ్ తీవ్రంగా దెబ్బ తీసింది. విశ్వమహమ్మారి ప్రారంభ దశలో 2020 మే- జులైల మధ్య సహకరించే దేశాల నుండి సైనిక దళాలు, పోలీసుల భ్రమణాన్ని స్తంభింపచేసింది. ఐరాస తన పనిని ప్రాథమిక వాస్తవానుగుణంగా మార్చుకోవల్సివచ్చింది. పోలీసు అధికారులు, సైనికులు, పౌరశాంతి పరిరక్షకులు సామాజిక ఏకాకులై పని చేయాల్సి వచ్చింది. పలు దేశాల్లో సామాజిక దూరం కొనసాగుతోంది. విశ్వమహమ్మారి -ప్రేరిత ప్రపంచ మాంద్యం, దాని ప్రభావాలు ఐరాస శాంతి కార్యకలాపాలపై ఆర్థిక పరిధిని గీశాయి. శాంతి పరిరక్షణ బడ్జెట్ 800 నుండి 600 కోట్ల డాలర్లకు తగ్గింది. పదేళ్లలో బహు పాక్షికత వివాదం, ప్రధాన శక్తుల మధ్య శత్రుత్వం, ఐరాస భద్రతా మండలి కొత్త శాంతి పరిరక్షక కార్యకలాపాలకు అధికారం ఇచ్చే అవకాశాలను చూడొచ్చు. అప్పటికి అంతర్జాతీయ వ్యవస్థ మరింత ఏకీకృత కొత్త ప్రపంచ క్రమానికి సర్దుకుంటుంది. శాంతి- నిర్మాణంలో అంతర్జాతీయ సమా జం పాత్ర గురించి నూతన ప్రపంచ అవగాహన ఏర్పడుతుంది.
కొత్త బహుపాక్షిక రూపాలు మరిన్ని దేశాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. బహు పాక్షికత కొత్త రూపాల అన్వేషణలో ఐరాస కీలక పాత్ర పోషిస్తుంది. ఐరాస బహు పాక్షికత మధ్య సమతుల్యతను సాధించాలి. సార్వత్రిక నియమాలను నిర్వచించాలి. ఏకాభిప్రాయాన్ని చేరుకోలేనప్పుడు ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి ఎక్కువ సౌలభ్యాన్ని అందించేది బహుపాక్షికత. ప్రాథమిక సూత్రాలను నిర్ధారిస్తూ ప్రతినిధులు, జవాబుదారీ మధ్యవర్తి సంస్థలు నిష్పక్షపాతంగా అమలు చేయగల ఆమోదిత చట్టబద్ధ సాధారణ నియమాల సమితిని రూపొందించాలి. 1.ప్రపంచ దేశాలు ఇతరులకు హాని కలిగించడం, నీ పొరుగువాడు బిక్షగాడు విధానాలను మానాలి. 2. దేశాలు సైబర్, ఆర్థిక, ఆర్థికేతర రంగాల్లో తమ హద్దులను నిర్ధారించుకోవాలి. 3. వాతావరణ పర్యావరణ మార్పులతో సహా అనేక సమస్యలపై ప్రపంచ దేశాలు సామాన్యులకు సమర్థవంతంగా సహకరించాలి. 4. ప్రపంచ ప్రజా వస్తువుల ఉత్పత్తికి దేశాలు సహకారాన్ని పెంచుకోవాలి. 5.దేశాలు ప్రపంచ ఆర్థిక వృద్ధి, అభివృద్ధిని ప్రోత్సహించాలి. ప్రపంచ సమస్యలను కలిసి పరిష్కరించుకోవాలి.
సంస్థాగత వైవిధ్యం, ఆమోదించబడిన బహు పాక్షికతల కొత్త ఒప్పందానికి పునాది వేసే సూత్రాల సమితిని అభివృద్ధి చేయడం లో ఐరాస ప్రధాన పాత్ర పోషించాలి. బహుపాక్షిక ప్రయత్నాల్లో భాగంగా, జాతీయ, బహుపాక్షిక లక్ష్యాలను ఏకీకృతం చేయడంలో ముఖ్యపాత్రను పోషిస్తూనే, ప్రజల శ్రేయస్సును ప్రోత్సహించాలి. ప్రపంచానికి సమ్మిళిత విధానం అవసరం. ప్రపంచం కొత్త ప్రపంచక్రమం, ప్రపంచ పాలన నిర్మాణాన్ని స్థాపించే దశలో ఉంది. రాజకీయ, సైనిక సమూహాలు అమలులో ఉన్న ప్రపంచక్రమాన్ని క్షీణింపజేశాయి. ప్రపంచపాలనా వ్యవస్థను విభజించి, విచ్ఛిన్నం చేశాయి. ఈ పరిస్థితులలో, ప్రపంచ పాలనాక్రమ పునర్నిర్మాణం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రపంచ సమూహాల ప్రాథమిక నియమాలు, వివిధ రంగాలను నియంత్రించే అనువర్తన- ఆధారిత నిర్దిష్ట నియమాలతో కొత్త ప్రపంచ పాలనా వ్యవస్థపై ఏకాభిప్రాయం సాధించాలి. ప్రాథమిక నియమాలు, సాధారణ, విస్తృత ఆమోదిత సూత్రాలు, విధివిధానాలు, ఐరాస సూత్రాలను చాలా దేశాలు నిర్లక్ష్యం చేశాయి. అంతర్జాతీయ సంస్థలపై అమెరికా పెత్తనం చలాయిస్తోంది.
విశ్వమహమ్మారి అనంతర ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ అసమతుల్యమైంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా తక్కువ- అభివృద్ధి చెందిన దేశాలు కరువు, ఆర్థిక శరణార్థుల సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. ఇది వారి అభివృద్ధిని అడ్డుకోవచ్చు. కాబట్టి ప్రపంచం అభివృద్ధి లోటులను ఎదుర్కోవాలి. ఉమ్మడి ప్రయోజన సూత్రాన్ని సమర్థిస్తూ సహ-అభివృద్ధిని ప్రోత్సహించాలి. ఈ విషయంలో, వివిధ దేశాల ప్రత్యేక అవసరాలపై శ్రద్ధ చూపడం, వారి రుణాల చెల్లింపును మినహాయించడం లేదా వాయిదా వేయడం సహాయకరంగా ఉంటుంది. అంతేకాక అంతర్జాతీయ సమాజం తీవ్రవాద వ్యతిరేకతపై ద్వంద్వ ప్రమాణాలను మానాలి. అణు భద్రత, సైబర్ భద్రతపై ఒప్పందాల అనుకూలీకరణకు ప్రయత్నించాలి.
ప్రపంచ పాలనలో ఐరాస ప్రధాన హోదా పటిష్టతకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు, వివిధ దేశాల మధ్య సమన్వయ సాధనకు జి20 వేదికను ఉపయోగించుకునే సమగ్ర, న్యాయ చట్ర రూపకల్పనకు అంతర్జాతీయ సమాజం విశ్వవ్యాప్త పాలనా వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ప్రాంతీయ పాలన యంత్రాంగాలు, ప్రపంచ పర్యావరణ, ప్రజారోగ్య, దక్షిణ- సహకారాన్ని ప్రోత్సహించాలి. ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ యూనియన్, ఇంటర్నేషనల్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఐరాస ఇతర సంస్థల కార్యక్రమాల మెరుగుదలకు అంతర్జాతీయ సంస్థలలో అధికారాలు మరింత సమతుల్యంగా ఉండాలి. కానీ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో అలా లేదు. ఇందులో చైనా ఓటింగ్ వాటా 6%. చైనా జిడిపి ప్రపంచ జిడిపిలో 20%. మరో వైపు ఐరోపా దేశాల జిడిపి ప్రపంచ మొత్తంలో 15% ఉండగా, ఐఎంఎఫ్లో వారి ఓటింగ్ వాటా 20%.
మూడు ప్రధాన కారణాల వల్ల ప్రపంచం గణనీయంగా మారుతోంది. 1. ప్రపంచ పాలన మారింది. 10, 20 ఏళ్ల క్రితం ప్రజలు వాణిజ్యం, పెట్టుబడి, మూలధన ప్రవాహాలు, ఛానెళ్ల నిర్వహణ, పరస్పరాధార నియమాల గురించి మాట్లాడేవారు. నేడు వాతావరణ మార్పు, సమాచారం నుండి ప్రజావసతి వరకు వివిధ రకాల సమస్యలు బహిరంగ చర్చలలో ఆధిపత్యం వహిస్తున్నాయి. నీ పొరుగువాడు బిక్షగాడు విధానాలకు చోటులేని నిబంధనల ఏర్పాటుతోనే కాక సమిష్టి చర్యల ద్వారా ప్రపంచం ఈ సమస్యలను పరిష్కరించాలి. ప్రపంచ ప్రజావస్తువుల భావన దుర్వినియోగం చేయబడింది. వస్తువులన్నీ ప్రపంచ ప్రజాప్రయోజనాలు కాదు. 2.అతిశయ కొత్తదనం స్థాయి. ప్రపంచం అపూర్వ, అసమాన స్థాయి అభివృద్ధిని ఎదుర్కొంటోంది. పేద దేశాల తలసరి జిడిపి మూడింట ఒక వంతు పెరగగా, అమెరికా తలసరి జిడిపి రెండింతలు పెరిగింది. వివిధ రకాల ఆర్థిక వ్యవస్థలు, విలువల వైవిధ్యతలతోనూ ప్రభావితమైన అభివృద్ధి ప్రాధాన్యతల వైవిధ్యాన్ని ఎలా నిర్వహించాలన్నది సమస్య. 3. ఆర్థిక శాస్త్రం, రాజకీయాల పెనవేత. అవి ఎప్పుడూ పూర్తి భిన్నంగా లేవు. ఇప్పుడు ప్రజలు ఆర్థిక పరస్పరాధారం, భౌగోళిక రాజకీయ శత్రుత్వం మధ్య నిరంతరం చర్యలలో ఉన్నారు.
ఐరాసలో వీటో హక్కును రద్దు చేయాలి. మైనారిటి అభిప్రాయాలను పరిగణించాలి. అమెరికా ఆయుధాలు అమ్మే కార్పొరేట్ల కొమ్ముకాయరాదు. చైనాను శత్రువుగా కాక పోటీ దేశంగా చూడాలి. చైనా సొంత ప్రపంచ వాణిజ్యం కొంత మానుకొని పేద, అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాలకు సాయపడాలి. రష్యా సోవియట్ పంథాను పాటించాలి. ఇండియా సౌజన్య పక్షపాతం మానాలి. అమెరికా, నాటో, పాశ్చాత్య దేశాల పంచను వీడాలి.

సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News