హైదరాబాద్: క్యాన్సర్‌పై అవగాహన కల్పించే రన్‌ను నిర్వహించడం చాలామంది పరిణామమని, దానిలో సైబరాబాద్ పోలీసులు భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవేర్‌నెస్ రన్ ‘గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్-2023‘ కోసం రూపొందించిన టీషర్ట్‌ను సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర విడుదల చేశారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ రన్ నిర్వాహకులకు సైబరాబాద్ పోలీసులు అండగా ఉంటారని అన్నారు.
ఫిజికల్, వర్చువల్ మోడ్ ద్వారా 130 దేశాల నుంచి 1 లక్ష మంది రన్‌లో పాల్గొనే అవకాశం ఉందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవగాహన రన్ ‘క్వాంబియంట్ డెవలపర్స్ – గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ -2023‘ అక్టోబర్ 8న గచ్చిబౌలి స్టేడియంలో జరగనుందని తెలిపారు. రన్ ఒక వైవిధ్యంతో నడుస్తుందని , ఇది గొప్ప పరుగని అన్నారు. ఇది స్పోర్ట్ ఈవెంట్ కాదని, గ్లోబల్ ఈవెంట్ అని అన్నారు. ’బీ లైట్’ అనే థీమ్‌తో 6వ ఎడిషన్ రన్‌లో 130కి పైగా దేశాల నుండి లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొంటారని సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గ్రేస్ (గ్లోబల్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఎడ్యుకేషన్) క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి తెలిపారు.
రన్ మూడు వేర్వేరు విభాగాలలో నిర్వహించబడుతుందని,5K, 10K, 21.1K (హాఫ్ మారథాన్) నిర్వహిస్తామని, గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమంలో 25 వేల మందికి పైగా పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఇది హైబ్రిడ్ పద్దతిలో అనగా –భౌతికంగా, వర్చువల్ పద్దతిలో నిర్వహించబడుతుందని, భారతదేశంలో రెండు వేర్వేరు ఫార్మాట్లలో జరిగే ఏకైక రన్ ఇదేనని పేర్కొన్నారు. ఎడ్యుకేషన్, ఎర్లీ డిటెక్షన్, ట్రీట్‌మెంట్, రీహాబిలిటేషన్, అత్యాధునిక పరిశోధనల ద్వారా క్యాన్సర్ భారాన్ని తగ్గించడానికి స్థాపించబడిన హైదరాబాద్‌కు చెందిన లాభాపేక్షలేని సంస్థ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
పాల్గొనే ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన దూరాన్ని పరిగెత్తడమే కాకుండా, తమ రిజిస్ట్రేషన్ ఫీజులో కొంత భాగాన్ని క్యాన్సర్ స్క్రీనింగ్, అవగాహన కోసం విరాళంగా ఇవ్వాలని కోరారు. వ్యాధులు బయటి నుండి వస్తాయి, క్యాన్సర్ మాత్రం లోపల నుండి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి వైద్యులు, పోలీసులు కలసి రావడం విశేషమని అన్నారు. వైద్యులు శరీరంలోని రోగాన్ని నయం చేస్తే, పోలీసులు సమాజంలోని వ్యాధిని నయం చేస్తారు అన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అట్టడుగు వర్గాలకు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయం చేస్తుందని అన్నారు. చాలా కణితులను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స చేస్తే క్యాన్సర్ నుంచి బయటపడవచ్చని అన్నారు.
మారుమూల గ్రామాలు, మురికివాడల్లో నివసించే చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియక, క్యాన్సర్ బారిన పడి మృతిచెందుతున్నారని తెలిపారు. ఇలాంటి వారిని చేరుకోని వారిని చేరదీసి, క్యాన్సర్ వ్యాధి గురించి అవగాహన కల్పించాలనేది మా ప్రగాఢ కోరిక అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 9.5 మిలియన్ల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారనేది విస్మయం కలిగిస్తోంది. కాబట్టి, ఎక్కువ మంది దీని బారిన పడకుండా నిరోధించడానికి, ఫౌండేషన్ ఇప్పటివరకు 4 ఖండాలను కవర్ చేస్తూ 10 దేశాలలో ఉచిత స్క్రీనింగ్ క్యాంపులు, క్యాన్సర్ అవగాహన చర్చలు, క్యాన్సర్ రన్‌లను నిర్వహిస్తోంది. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఎఎస్ అజయ్‌మిశ్రా, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.