Monday, January 20, 2025

అద్దంపై అక్కసు!

- Advertisement -
- Advertisement -

EC Delay Gujarat election schedule only to benefit BJP

కొన్ని కఠోర వాస్తవాలు కొందరికి మింగుడు పడవు. అంత మాత్రాన అవి నిష్ఠుర నిజాలు కాకమానవు. ప్రపంచ ఆకలి సూచీలో భారత దేశం మరింత అధోగతికి జారిపోయిందన్న సమాచారం భారతీయులుగా మనకు చాలా బాధ కలిగించడం సహజం. అంత మాత్రాన దాని మీద మసిపూస్తే అది వాస్తవం కాకుండా పోతుందా? ఈ ఏడాది 121 దేశాల ఆకలి జాబితాలో మనం 107వ స్థానంలో వున్నట్టు వెల్లడైంది. ఎత్తుకు తగిన బరువులేని ఐదేళ్లలోపు పిల్లల రేటింగ్ మన దేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా 19.3 శాతం అని ఈ నివేదిక స్పష్టం చేసింది. గత ఏడాది ఇదే సమయంలో విడుదల చేసిన 116 దేశాల ఆకలి సూచీ జాబితాలో మనది 101వ స్థానం.

ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్షాల్లో భాగంగా 2030 నాటికి ప్రపంచంలో ఆకలిని నిర్మూలించాలనే గొప్ప ఆశయంతో రెండు అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థలు 2000 వ సంవతరం నుంచి ప్రపంచ ఆకలి దేశాల జాబితాను తయారు చేస్తున్నాయి. ఈ రెండు సంస్థల్లో ఒకటి జర్మనీకి చెందిన వెల్ట్ హంగర్ హిల్ఫ్ కాగా, రెండవది ఐర్లాండుకు చెందిన కాన్సర్న్ వరల్డ్ వైడ్. కేవలం తిండి లేక పోయినందు వల్ల కలిగే ఆకలిని మాత్రమే ఈ నివేదిక పరిగణనలోకి తీసుకోదు. మరింత విస్తృతమైన అధ్యయనం చేసి ఆ దేశంలో బాలల పరిస్థితిని బట్టి ఆకలి స్థాయిని నిర్ధారిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో పోషకాహార లేమి, ఐదేళ్ల వయసులోపు వారిలో ఎత్తుకు తగిన బరువు వున్నారో లేరో, అలాగే వయసుకు తగిన ఎత్తు కలిగి వున్నారో లేదో, బాల మరణాలు వగైరా అంశాలను క్షుణ్ణంగా తెలుసుకొని ఈ రెండు సంస్థలు ఆకలి దేశాల సూచీని ఏటా ఈ సమయంలో విడుదల చేస్తుంటాయి.

మన దేశంలో పిల్లల దయనీయ స్థితి గురించి ఇటువంటి సంస్థలేవో ప్రత్యేకించి పరిశోధించి చెప్పవలసిన పని లేదు. నిన్న మొన్నటి వరకు బహిరంగ మల మూత్ర విసర్జనలతో పేదల ఆవాసాలు ఎంత దయనీయ స్థితిలో వుండేవో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ పోషకాహార లేమి అసాధారణంగా వుంది. 2018 2020లో దేశంలో పోషకాహార లేమి 14.6 వుండగా, అది 20192021కి 16.3 శాతానికి పెరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా 82 కోట్ల 80 లక్షల మంది పోషకాహారం లోపించిన వారుండగా, అందులో 22 కోట్ల 43 లక్షల మంది ఇండియాలోనే వున్నారు. ఈ ఏడాది ఆకలి సూచీలో ఇండియా పొరుగునున్న శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల కంటే వెనుకబడి వుంది. శ్రీలంక 64వ ర్యాంకులో వుండగా, పాకిస్తాన్ 99, నేపాల్ 81, బంగ్లాదేశ్ 84 స్థానాల్లో వున్నాయి.

కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల 10 లక్షల మంది దారిద్య్రంలో కూరుకుపోగా వారిలో 5 కోట్ల 60 లక్షల మంది ఇండియానే వున్నారు. మన దేశంలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో 8 కోట్ల 30 లక్షల మంది దారిద్య్ర రేఖకు దిగువన వున్నారు. భారత దేశంలో అత్యధిక జనాభా వున్న మాట వాస్తవమే. చైనాలో మాదిరిగా ఈ మానవ వనరులను ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము? పండించే రైతు ఆత్మహత్యను ఆశ్రయించాల్సిన దుస్థితి ఎందుకుంది? మన పాలకులు ఈ విషయాలపై గట్టిగా ఎప్పుడైనా దృష్టి పెట్టారా? పెట్టకపోగా వున్న మాట చెప్పినందుకు ఆకలి సూచీ సంస్థలను ఆడిపోసుకోడం మనకే చెల్లింది. ఈ నివేదిక దురుద్దేశంతో కూడుకొన్నదని, బాధ్యతా రహితమైనదని బిజెపి సైద్ధాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్ చేసిన విమర్శ గమనించదగినది. నివేదికలో ఇచ్చిన గణాంక వివరాలు తప్పుల తడకలని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ సునిశితమైన బాణాన్ని ఎక్కుబెట్టింది.

దేశంలో ఆకలిని నిర్ధారించడానికి ఈ సంస్థలు ఎంచుకొన్న పద్ధతి లోపభూయిష్టమైనదని విమర్శించింది. మన లోపాలను సహేతుకంగా ఎత్తి చూపేవారందరినీ ఇలా తప్పుపడితే ఎలా? స్వదేశీ జాగరణ్ మంచ్ కేవలం విమర్శించి ఊరుకోలేదు. ఈ నివేదిక కర్తలపై పరువు నష్టం కింద చర్య తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి సూచించింది. ఒకప్పుడు కేవలం రూ. 450 లున్న వంట గ్యాస్ ఇప్పుడు రూ. 1050 దాటిపోయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మనకిక బొగ్గు పొయ్యిలే శరణ్యమని ఉచిత సలహా పారేశారు. ఆస్ట్రియా వంటి దేశాల్లో కూడా వంట గ్యాస్‌ను వదిలేసి బొగ్గు మీద ఆధారపడుతున్నారని మన వంటి అతి పెద్ద దేశానికి అవసరమైనన్ని సిలిండర్లు లభించవని ఆమె సెలవిచ్చారు. మరోవైపు డాలర్‌కు రూ. 82 అయిపోయింది. ఈ మారకపు విలువలో రూపా యి మరిన్ని లోతులు చూడగలదని జోస్యం చెబుతున్నారు. 85 శాతం ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్న మనకు ఇది ఎంతటి మోయలేని బరువో చెప్పనక్కర లేదు. ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో పిల్లలకు తగిన పోషకాహారం అందించే శక్తి ఎంత మందికి వుంటుంది? మన ముఖం బాగోలేక అద్దాన్ని బద్దలు కొడదామంటే ఎలా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News