Friday, November 22, 2024

ఔషధ విషాదాలు!

- Advertisement -
- Advertisement -

ఔషధ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న చక్రవర్తి భారత్. ఆ స్థాయిని కోల్పోతామనే భయాన్ని కలిగిస్తూ మన మందులు వివిధ దేశాల్లో వికటించిన సందర్భాలు ఇటీవల సంభవించాయి. మొదటిసారి అటువంటి ఉదంతం జరిగినప్పుడు భారత ప్రభుత్వం మేల్కొని దేశం నుంచి ఎగుమతి అవుతున్న మందులపై గట్టి తనిఖీలు జరిపి దోషులను శిక్షించి వుంటే మరో చోట అది జరగకుండా అరికట్టడం సాధ్యమై వుండేది. దొంగలు పడ్డ ఆరు మాసాలకు నిద్ర లేచిన పోలీసు మాదిరిగా అత్యంత ఆలస్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టిందనే అభిప్రాయానికి అవకాశం కలుగుతున్నది. దీని వల్ల మన ఔషధాల విశ్వసనీయత అంతర్జాతీయ స్థాయిలో దెబ్బ తినే ప్రమాదం తలెత్తింది.

మన చుక్కల మందు వల్ల శ్రీలంకలో 30 మందికి పైగా కంటి రోగులకు ఇన్‌ఫెక్షన్ కలిగిందని ఈ నెల ఆరంభంలో వార్తలు వచ్చాయి. గుజరాత్‌కు చెందిన ఇండియానా ఆఫ్తాల్ మిక్స్ ఈ చుక్కల మందును తయారు చేస్తున్నట్టు తెలిసింది. దీనితో ఈ మందుపై మన కేంద్ర ఔషధ ప్రమాణాల సంస్థ దర్యాప్తు చేపట్టింది. గుజరాత్ సంస్థ శ్రీలంకలో చిరకాలంగా ఈ మందును సరఫరా చేస్తున్నది. అందుకోసం శ్రీలంక జాతీయ ఔషధ నియంత్రణ సంస్థతో వాణిజ్య సంబంధాలు ఏర్పాటు చేసుకొన్నది. 30 మంది రోగులపై ఈ మందు దుష్ప్రభావం చూపడంతో శ్రీలంక సంస్థ కూడా ఈ మందును మార్కెట్ నుంచి వెనుకకు పిలిపించింది. గత ఏడాది మన మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసిన మందుల వల్ల తమ దేశంలో 70 మంది పిల్లలు మూత్రపిండాలు చెడిపోయి చనిపోయారని గాంబియా ప్రభుత్వం తెలియజేసింది.

అలాగే మన మారియన్ బయోటెక్ కు చెందిన దగ్గు మందు వాడి గత డిసెంబర్‌లో ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది పిల్లలు మరణించారు. గ్లోబల్ ఫార్మా అనే భారతీయ ఔషధ సంస్థ తయారు చేసిన కంటి చుక్కల మందు వల్ల అమెరికాలో 68 మంది అనారోగ్యం పాలయ్యారని, వీరిలో 8 మంది కంటి చూపు పోయిందని, ముగ్గురు చనిపోయారని గత ఏప్రిల్‌లో వెల్లడైంది. ఈ ఘటనలు చోటు చేసుకోగానే ఎజ్రికేర్ ఐడ్రాప్స్ అనే ఈ మందును అక్కడ మార్కెట్ నుంచి వెలివేశారు. మన కేంద్ర ప్రభుత్వం 18 ఔషధ తయారీ కంపెనీల లైసెన్సులను సస్పెండ్ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ మనం ప్రపంచానికే మందులు సరఫరా చేస్తున్నాము. ప్రపంచ ఫార్మసీగా వర్ధిల్లుతున్నాము. మనది ప్రమాణాలు గల మందుల తయారీ వ్యవస్థ అని అన్నారు.

అలాగే మన మందుల్లో గల లోపాలను సవరించడానికి తగిన చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. అదే నిజమైతే సంతోషించవలసిందే. కాని గత ఏడాది మొట్టమొదటిసారిగా మన మందుల్లోని ప్రమాదకర లక్షణాలు బయటపడిన తర్వాత తిరిగి ఈ ఏడాది కూడా అటువంటి ఘటనలు చోటు చేసుకోడం వెనుక ప్రభుత్వ నిర్లక్షం స్పష్టంగా కనిపిస్తున్నది. 202122లో 17 బిలియన్ డాలర్ల దగ్గు సిరప్‌ను మనం ఎగుమతి చేశాము. 202223లో ఇది 17.6 బిలియన్ డాలర్లకు చేరుకొన్నది. ప్రపంచ దేశాలకు అవసరమవుతున్న వివిధ టీకా మందుల్లో సగం మన దేశం నుంచే వెళుతున్నాయి. అమెరికాలో వినియోగిస్తున్న జనరిక్ మందుల్లో 40% భారత్‌వే. 202324 లో మన ఔషధ ఎగుమతులు రూ. 2.3 లక్షల కోట్ల స్థాయికి చేరుకోగలవని భారత మందుల ఎగుమతుల పెంపు మండలి డైరెక్టర్ జనరల్ ఆర్ ఉదయభాస్కర్ తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఎగుమతులు వరుసగా పెరుగుతూ వస్తున్నాయని కూడా చెప్పారు.

మందులను మార్కెట్‌లోకి విడుదల చేసే ముందు జరిపే క్లినికల్ పరీక్షలపై కఠిన నిబంధనలు వుండడం అవసరమని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఎటువంటి లోపాలు లేకుండా చూడడానికి నాణ్యతా నిబంధనలు పాటించేలా కంపెనీలతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. ఇంతగా ప్రపంచ ప్రజల ఆరోగ్యాలతో పెనవేసుకొన్న భారతీయ ఔషధ తయారీ రంగాన్ని నాణ్యతా ప్రమాణాల పాటింపు పరంగా మెరుగు పరచవలసిన అవసరం వున్నది. లేకపోతే ఇంత శిఖరాయమానమైన స్థితి నుంచి అతి కొద్ది కాలంలోనే పతనమైపోయే ప్రమాదం వుంది. మంచిని సాధించినప్పుడు దానిని ఎంతగా గొప్పగా చెప్పుకొంటామో, ముప్పు పొంచి వున్నప్పుడు అంతే జాగ్రత్తగా దానిని కాపాడుకోవలసి వుంది. మన ఔషధ తయారీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిన తర్వాత మందుల ఉత్పత్తి కుటీర పరిశ్రమలా మారిపోయే అవకాశాలు పెరుగుతాయి. అందుచేత కింది నుంచిపై వరకు అన్ని స్థాయిల్లోనూ జాగరూకత వహించవలసిన అవసరం వుంది. నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అనే నానుడి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News