Friday, January 10, 2025

భారత్‌కు రాజకీయ రిస్క్..

- Advertisement -
- Advertisement -

దావోస్ : ప్రపంచ ఆర్థిక సమాఖ్య వార్షిక సదస్సు నేపథ్యంలో ప్రపంచ స్థాయి సవాళ్ల ప్రస్తావనతో గ్లోబల్ రిస్క్‌రిపోర్టు (జిబిఆర్)ను సమగ్రరీతిలో వెలువరించింది. సునిశిత విశ్లేషణతో సమకాలీన విషయాలను, అంటువ్యాధుల సమస్యలను , అక్రమ ఆర్థిక కార్యకలాపాలను , ఆర్థిక అసమానతలను , కార్మిక శక్తి కొరత , ఇదే క్రమంలో నిరుద్యోగ సమస్య వంటి విషయాలు అనేకం ప్రస్తావనకు వచ్చాయి. సభ్య దేశాలు ఇండియా, అమెరికాలో ఈ ఏడాదే సార్వత్రిక ఎన్నికలు, సామాజిక విభజిత పరిణామాలు, సమాచార లోపాలు వంటివి ప్రపంచ స్థాయిలో రిస్క్ పరిణామాలని విశ్లేషించారు. ఇండియా గురించి ప్రస్తావిస్తూ ఇక్కడ ఈ ఏడాది ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇక్కడ తప్పుడు సమాచారం, సమాచార లేమి వంటివి , సామాజిక విభజన రేఖలు అత్యంత కీలకమైన ముప్పునకు దారితీస్తాయని, అమెరికాలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా సాగే వాగ్దానాలు, ప్రచార దశలో లేవనెత్తే అంశాలను , వీటి తరువాతి క్రమంలో తలెత్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రత్యేకంగా భారత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నివేదికలో తెలిపారు. ప్రపంచ స్థాయిలో అంటువ్యాధుల బెడదలు, అక్రమ వ్యాపార ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక అసమానతలు, ఉపాధి సమస్యు వంటి ఐదు ప్రధాన విషయాలు స్వల్ప కాలిక ముప్పునకు దారితీస్తాయని తెలిపారు. ఇక దీర్ఘకాలిక పది సంవత్సరాల వ్యవధిలో ప్రపంచం తీవ్రస్థాయి వాతావరణ వైపరీత్యాలను ఎదుర్కొంటుందని, శీతల చలి వాతావరణం, ఆకస్మిక వరదలు, వేడిమి వంటివి ప్రపంచం ఎదుర్కోవల్సి వస్తుందని విశ్లేషించారు. ప్రపంచ స్థాయిలో సమస్యలు ఎప్పటికప్పుడు తలెత్తే పరిణామం ఇప్పుడు సర్వసాధారణం అయింది. కానీ దీనికి అనుగుణంగా ప్రపంచ దేశాలు సమిష్టిగా ముందుగా స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. సమస్య తీవ్రతరం అయినప్పుడే అనివార్యంగా అతికష్టంగా కలిసికట్టు చర్యల దిశలో అడుగులు పడుతున్నాయి.

అయితే అప్పటికే పరిస్థితి చేజారి పోతుండటంతో క్లిష్టతల నివారణకు కష్టపడాల్సి వస్తోందని తెలిపారు. వచ్చే దశాబ్ధంలో ప్రపంచం పలు విషయాలలో బహుముఖ లేదా విభజిత కోణాలలో సాగుతుంది. మధ్యస్థ, అగ్రరాజ్యాల నడుమ పోటీ ఏర్పడుతుంది. ఆధిపత్య ధోరణితో సాగే దేశాలు కొత్త నిబంధనలు పెట్టి, వాటిని అమలు చేయించే దశకు చేరుతాయని వివరించారు. రాబోయే రెండు మూడు సంవత్సరాలలో ఉత్పన్నమయ్యే తీవ్రస్థాయి సామాజిక , రాజకీయ అగాధాలు ప్రపంచానికి మరిన్ని సవాళ్లను విసురుతాయి. భేషజాలు వీడి సమస్యలకు అతీతంగా ప్రపంచ దేశాలు సర్వదా స్పందిస్తేనే దీర్ఘకాలిక సమస్యలు తలెత్తకుండా , తలెత్తినా సత్వర పరిష్కారానికి వీలేర్పడుతుందని నివేదికలో సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News