అమెరికా ప్రతీకార సుంకాలతో చిగురుటాకులా వణికిన ప్రపంచ స్టాక్ మార్కెట్లు
ఆర్థికమాంద్యం భయాలతో భారీగా పతనం ఒక్కరోజే 2,227 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ఇన్వెస్టర్ల సంపద రూ.14లక్షల కోట్లు ఆవిరి
పది సెకండ్లలోనే 3వేల పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్
ఆ తరువాత కోలుకొని 73,137 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్
ఐటి, బ్యాంకింగ్, బీమా, ఆటో మొబైల్షేర్లకు భారీ నష్టం
ఆసియా, ఐరోపా సూచీలు ఆగమాగం మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు డౌన్ జపాన్ నిక్కీ
8.4శాతం, సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్
8 శాతం, హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్
15.24 శాతం, దక్షిణకొరియా కోస్పీ
5.89 శాతం ఢమాల్
ట్రంప్ టారిఫ్‌లతో ఆర్థిక మాంద్యం భయాలు
గ్లోబల్ మార్కెట్లు భారీ పతనం
ఒక్క రోజే 2,227 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి
అమెరికా, చైనాల మధ్య రగిలిన సుంకాల సమరం ప్రపంచ స్టాక్ మార్కెట్లను గడగడలాడించింది. ట్రంప్ ప్రతీకార సుంకాలు విధిస్తే చైనా తామేమి తక్కువ కాదంటూ అదనపు సుంకాలు విధించడంతో వాణిజ్య భయాలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో ద్రవ్యోల్బణం ముంచుకొస్తుందన్న భయం మదుపరులలో చుట్టుముట్టింది. దీంతో వారు అమ్మకాలకు సిద్ధపడ్డారు. ఇది సునామీలా మారి మార్కెట్లను కుప్పకూల్చింది. బిఎస్‌ఇ ఒక్కరోజే 2,227 పాయింట్లు తగ్గింది. రూ.14లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి అయింది. జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా,హాంకాంగ్ మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి.
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లతో ప్రపంచ మార్కెట్లు గజగజ వణుకుతున్నాయి. వాణిజ్య యుద్ధం ఆందోళనలు, యుఎస్‌లో మాంద్యం భయాల కారణంగా భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. భారత స్టాక్‌మార్కెట్లు ఈ సంవత్సరం రెండో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. సోమవారం ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. మార్కెట్లు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ ఏకంగా 3,000 పాయింట్లకు పైగా పడిపోయింది. అయితే ఆఖరి సమయంలో కోలుకుని 2,227 (2.95 శాతం) నష్టంతో 73,137 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా అత్యధికంగా 743 పాయింట్లు (3.24 శాతం) నష్టపోయి 22,162 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 29 స్టాక్‌లు క్షీణించాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎల్ అండ్ టి షేర్లు 7 శాతం వరకు పడిపోయాయి. రంగాల వారీగా సూచీలలో నిఫ్టీ మెటల్ అత్యధికంగా 6.75 శాతం పడిపోయింది. రియాల్టీ 5.69 శాతం క్షీణించింది. ఆటో, ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, చమురు, గ్యాస్, ఐటి రంగాలు 4 శాతం క్షీణించాయి. ఏప్రిల్ 2 నుండి ముడి చమురు ధర 12.11 శాతం తగ్గింది. సోమవారం బ్రెంట్ ముడి చమురు 4 శాతం తగ్గి 64 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. ఇది గత 4 సంవత్సరాలలో అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్‌ఇ) మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1,850 పాయింట్లు (4.60 తగ్గి 38,630 స్థాయికి చేరుకుంది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2,860 పాయింట్లు (6.20 శాతం) తగ్గి 42,999.82 వద్ద ట్రేడయింది. స్టాక్ మార్కెట్లో అమ్మకాల కారణంగా పెట్టుబడిదారుల సంపద సుమారు రూ.14 లక్షల కోట్లు తగ్గింది. ఏప్రిల్ 4 శుక్రవారం బిఎస్‌ఇలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.403.34 లక్షల కోట్లుగా ఉంది. సోమవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఇది దాదాపు రూ.389.25 లక్షల కోట్లకు తగ్గింది.
వాల్‌స్ట్రీట్ 3 శాతం డౌన్
అమెరికా టారిఫ్‌లు యుఎస్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. డో జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1,213 పాయింట్లు (3.17 శాతం) పడిపోయి 37,101 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్ అండ్ పి 500 దాదాపు 181.37 పాయింట్లు అంటే 3.57 శాతం నష్టపోయి 4,892 పాయింట్లకు తగ్గింది. అదే సమయంలో నాస్‌డాక్ 623.23 పాయింట్లు (4 శాతం) నష్టపోయి 14,964 పాయింట్ల వద్ద స్థిరపడింది. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ 13 శాతం, చైనా ఇండెక్స్ 7 శాతం పడిపోయాయి. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 7.83 శాతం, కొరియా కోస్పి ఇండెక్స్ 5.57 శాతం, చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 7.34 శాతం, హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ 13.22 శాతం, ఏప్రిల్ 3న అమెరికా డౌ జోన్స్ 3.98 శాతం తగ్గింది.
వారెన్ బఫెట్ రూటే వేరు.. పెరిగిన సంపద
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్లు నష్టాలను చవిచూస్తుండగా పెట్టుబడి మాంత్రికుడు వారెన్ బఫెట్ సంపద మాత్రం పెరిగింది. ఆయన ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు రూ.1,100 బిలియన్లు (12.7 బిలియన్ డాలర్లు) సంపాదించారు. అంటే ముగ్గురు భారతీయ పారిశ్రామికవేత్తలు కలిసి కోల్పోయిన దానికంటే వాఫెట్ ఒక్కడే ఎక్కువ సంపాదించారు. బఫెట్ నికర విలువ 155 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మరోవైపు ప్రపంచ నం.1 కుబేరుడు ఎలోన్ మస్క్ సంపద 130 బిలియన్ డాలర్లు క్షీణించగా, జెఫ్ బెజోస్ (45.2 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్‌బర్గ్ (28.1 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్ (18.6 బిలియన్ డాలర్లు), బిల్ గేట్స్ (3.38 బిలియన్ డాలర్లు) నష్టాలను చవిచూశారు.
మార్కెట్ పతనానికి కారణాలు
ట్రంప్ సుంకాలు
అమెరికా భారతదేశంపై 26 శాతం సుంకం విధించగా, ఇతర దేశాలపైనా భారీ సుంకాలను ప్రకటించింది. చైనాపై అత్యధికంగా 34 శాతం, యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం, దక్షిణ కొరియాపై 25 శాతం, జపాన్‌పై 24 శాతం, వియత్నాంపై 46 శాతం, తైవాన్‌పై 32 శాతం సుంకాలు విధించారు. ఈ సుంకాల కారణంగా ఇన్వెస్టర్లలో ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలు ఉండడంతో మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి.
చైనా ప్రతీకారంగా 34% సుంకం
చైనా అమెరికాకు ధీటుగా స్పందించింది. గత శుక్రవారం చైనా అమెరికాపై 34 శాతం ప్రతీకార సుంకాన్ని ప్రకటించింది. ఈ కొత్త సుంకం ఏప్రిల్ 10 నుండి అమల్లోకి వస్తుంది. ఏప్రిల్ 3న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ప్రతీకార సుంకాలను విధించారు. దీనిలో చైనాపై 34 శాతం అదనపు సుంకం విధించారు. ఇప్పుడు చైనా కూడా అమెరికాపై అదే సుంకాన్ని విధించింది.
ఆర్థిక మందగమనం ఆందోళనలు
సుంకాల కారణంగా వస్తువులు ఖరీదైనట్లయితే ప్రజలు తక్కువగా కొనుగోలు చేస్తారు. ఈ కారణంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుంది. అలాగే డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల ముడి చమురు ధరలు కూడా తగ్గాయి. ఇది బలహీనమైన ఆర్థిక కార్యకలాపాలకు సంకేతం, ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసింది.
1987 లాంటి ‘బ్లాక్ మండే’: జిమ్ క్రామెర్
న్యూయార్క్: ‘బ్లాక్ మండే’ అం చనా తర్వాత భారత స్టాక్ మార్కె ట్ కుప్పకూలింది. అమెరికా పరిస్థితి 1987 లాగా ఉండొచ్చు, యుఎస్ మార్కెట్లో 20 శాతం క్షీణత ఉంటుందని అమెరికన్ ని పుణులు హెచ్చరించారు. ఆర్థిక వ్యాఖ్యాత, మ్యాడ్ మనీ షో హోస్ట్ జిమ్ క్రామెర్ హెచ్చరిక నేపథ్యంలో భారత మార్కెట్లు 4 శాతం పతనంతో ట్రేడయ్యాయి. రెండు రోజుల క్రితం క్రామెర్ మాట్లాడుతూ, అమెరికా మార్కెట్ 1987 లాంటి ‘బ్లాక్ మండే’ని ఎదుర్కోవచ్చని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన పరస్పర సుంకాలతో ఈ పరిస్థితి ఏర్పడవచ్చని క్రామెర్ అన్నారు.