Saturday, December 21, 2024

జిఒ 3 రద్దు చేయాల్సిందే..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్, విద్యానగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల ఉద్యోగాలపై లేదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నియామకాల్లో మహిళల రిజర్వేషన్లను హరించే జిఒ 3ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిఒ 3 వల్ల ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మహిళలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ అంశంపై త్వరలో గవర్నర్‌ను కలవబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు జరిపిన నియామకాల్లో ఎంత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాయన్న విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో 3కు వ్యతిరేకంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో ఎంఎల్‌సి కవిత పాల్గొని మాట్లాడారు. సాధారణంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఉత్సవాలు చేసుకుంటారని, కానీ ఈ సారి తెలంగాణలో పరిస్థితి వేరుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కూడా ధర్నా చేయాల్సిన దౌర్భార్య స్థితిని ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు.
మార్కెట్ కమిటీల్లోనూ కెసిఆర్ మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు
1996లో తెలంగాణ బిడ్డ పివి నరసింహా రావు దేశ ప్రధానిగా మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని ఎంఎల్‌సి కవిత గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇంకా పెంచుకున్నామని, తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం పోలీసు నియామకాల్లో కూడా రిజర్వేషన్లను కల్పించిందని చెప్పారు. మార్కెట్ కమిటీ పదవుల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కెసిఆర్‌ది అని స్పష్టం చేశారు. కెసిఆర్ తీసుకున్న చర్యల వల్ల యూనివర్సిటీల్లో మహిళల సంఖ్య పెరిగిందని, మహిళలకు హాస్టళ్ల సంఖ్యను కూడా పెంచారని చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని తెలిపారు. కెసిఆర్ హయాంలో లక్షా 66 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే 33 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పించామని వివరించారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరాల నుంచి ఉన్న హక్కులను కొల్లగొట్టిందని ధ్వజమెత్తారు. నియామకాల్లో హారిజాంటర్ రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీం కోర్టు 2022లో తీర్పు ఇచ్చిందని, దాన్ని అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు కూడా చెప్పిందని, కానీ ఆ తీర్పు అమలు చేస్తే ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి అమలు చేయబోమని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్ తేల్చిచెప్పారని వివరించారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకుందని పేర్కొన్నారు. ఆడపిల్లల శవాల మీద పేలాలు ఏరుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందని విమర్శించారు. వ్యక్తిగత కారణాలతో మరణించిన ఆడపిల్లల ఉదంతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వాడుకుందని ఆరోపించారు. విద్యార్థులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఇప్పుడు అన్యాయం చేస్తున్నదని వ్యాఖ్యానించారు. 33 శాతం రిజర్వేషన్లను హరిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిఒ 3ను జారీ చేసిందని గుర్తు చేశారు.
జిఒ 3ను రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది
గురుకులాల నియామకాల్లో జిఒ 3ను అమలు చేయడం వల్ల మహిళలకు కేవలం 12 శాతం మాత్రమే రిజర్వేషన్లు లభించాయని కవిత స్పష్టం చేశారు. జిఒ 3 వల్ల నష్టం జరుగుతోందనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇక ముందు వచ్చే నోటిఫికేషన్లలో కూడా పరిస్థితి ఇలానే ఉండబోతుందని అన్నారు. కాబట్టి జిఒ 3ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిఒ 3ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని, ముఖ్యమంత్రిని నిద్రపోనివ్వబోమని తేల్చిచెప్పారు. గురుకులా నియామకాల్లో వికలాంగులకు ఇవ్వాల్సిన 4 శాతం రిజర్వేషన్లు కూడా ఇవ్వలేదని లేవనెత్తారు. నియామకాల్లో మహిళల రిజర్వేషన్ల కోసం హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని, అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళ్లాలని డిమాండ్ చేశారు. మహిళలకు రూ. 500కే సిలిండర్ ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిందని, అంటే మహిళలకు ఉద్యోగాలను ఎగరగొట్టి వంటింట్లో కూర్చోబెట్టాలని ఉద్ధేశించే కాంగ్రెస్ ఆ హామీ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రగతి నిరోధక మహిళా వ్యతిరేకిగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాజీ ఎంఎల్‌ఎ జాజుల సురేందర్, జగిత్యాల జెడ్‌పి చైర్ పర్సన్ దావా వసంత, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు దేవి ప్రసాద్, రాజీవ్ సాగర్, గజ్జల నగేష్, తాడురి శ్రీనివాస్, అనిల్ కుర్మాచలం, గెల్లు శ్రీనివాస్, టిఎస్‌పిఎస్‌సి మాజీ సభ్యురాలు సుమిత్ర తనోబా , బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ముఠా జై సింహా, యుపిఎఫ్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు, కో కన్వీనర్ రాజారాం యాదవ్, కోలా శ్రీనివాస్, ఆర్వి మహేందర్, బొల్లా శివ శంకర్, భారత్ జాగృతి జెనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి మంచాల, స్టేట్ సెక్రెటరీ అనంతుల ప్రశాంత్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నరేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News