విమానం ఇంజన్‌లో సాంకేతిక సమస్యలే కారణం
నాగపూర్: బెంగళూరు నుంచి పాట్నాకు 139 మంది ప్రయాణికులతో శనివారం బయల్దేరిన గో ఫస్ట్(ఒకప్పటి గోయిర్ ఎయిర్‌లైన్స్)కు చెందిన జి8 873 విమానం ఇంజన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నాగపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. నాగపూర్ విమానాశ్రయంలో ఉదయం 11.15 గంటలకు విమానం సురక్షితంగా దిగినట్లు ఆయన చెప్పారు. బెంగళూరులో బయల్దేరిన విమానంలోని ఒక ఇంజన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడాన్ని గుర్తించిన విమానం పైలట్ విమానాన్ని అత్యవసరంగా దించడానికి నాగపూర్ ఎటిసిని అనుమతి కోరినట్లు నాగపూర్ విమానాశ్రయం డైరెక్టర్ అబిద్ రూహి తెలిపారు. విమాన సిబ్బంది కాకుండా విమానంలో మొత్తం 139 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆయన చెప్పారు. పూర్తిస్థాయి ఎమర్జెన్సీగా ప్రకటించి అందుబాటులో రన్‌వేలను, అగ్నిమాపక శకటాలను, డాక్టర్లను, అంబులెన్సులను, పోలీసుల సమన్వయాన్ని ఉంచినట్లు ఆయన చెప్పారు. అదృష్టవశాత్తు విమానం సురక్షితంగా రన్‌వేపై దిగిందని ఆయన చెప్పారు.