Monday, December 23, 2024

నేడు గోవా, ఉత్తరాఖండ్ ఎన్నికల పోలింగ్

- Advertisement -
- Advertisement -

Goa Assembly elections tomorrow

బరిలో జాతీయ పార్టీలతో సహా పలు ప్రాంతీయ పార్టీలు

పనాజి: గోవా అసెంబ్లీకి సోమవారం ఎన్నికలు జరనున్నాయి. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి ఒకే రోజు పోలింగ్ జరగనుంది. 301 మంది అభ్యర్థులుతమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కొవిడ్ నిబంధనల మధ్య పోలింగ్ సజావుగా జరగడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. పేరుకు చిన్న రాష్ట్రమే అయినప్పటికీ గోవాలో లెక్కకు మించి పార్టీలు బరిలో ఉండడం సర్వ సాధారణం. ఈ సారి కూడా పరిస్థితిలో మార్పు లేదు. చిన్న చిన్న నియోజకవర్గాలతో తక్కువ ఓట్ల తేడాతోనే గెలుపు ఓటములు నిర్ణయించబడనుండడం, ప్రధాన పార్టీలయిన బిజెపి, కాంగ్రెస్‌లతో పాటుగా పలు ప్రాంతీయ పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి కొత్త పార్టీలు కూడా బరిలోకి దిగడంతో రాష్ట్ర ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అధికార బిజెపితో పాటుగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. బిజెపి హిందుత్వ అజెండా స్థానంలో అభివృద్ధి అజెండా తీసుకు వచ్చిన మనోహర్ పారికర్ వంటి దిగ్గజ నాయకుడు లేకపోవడం ఆ పార్టీకి తీరని లోటుగా మారింది.

పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్‌కు పనాజీనుండి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం, కాంగ్రెస్ వలస నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంతో ఏర్పడిన అంతర్గతవిభేదాలు కమలనాథులకు తలనొప్పిగా మారాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి ఫిరాయింపులు పెద్ద సమస్యగా మారాయి. గత అయిదేళ్లలో సుమారు 15 మంది పార్టీ ఎంఎల్‌ఎలు బిజెపిలో చేరడం, మాజీ ముఖ్యమంత్రి లూజినో ఫలేరియో తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరడం ఆ పార్టీకి తీరని దెబ్బ. రాష్ట్రస్థాయిలో సరైన నాయకుడు లేకపోవడంతో ఈ సారి ఆ పార్టీ ఏకంగా 31 మంది కొత్తవాళ్లకు టికెట్లు ఇచ్చింది. ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాయి. అన్ని నియోజకవరర్గాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండడం, పలు పార్టీలు బరిలో ఉండడంతో గెలుపు ఓటముల మార్జిన్లు వందల సంఖ్యలోనే ఉండే అవకాశం ఉంది. వాస్కో నియోజకవర్గంలో అత్యధికంగా 35 వేల పైచిలుకు ఓటర్లు ఉండగా,మార్మగోవా స్థానంలో అత్యంత తక్కువగా 19,958 మంది ఓటర్లు ఉన్నారు.

ఇదిలా ఉండగా కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ఓటర్లకు పోలింగ్ స్టేషన్లలో గ్లౌవ్స్‌ను అందజేయనున్నట్లు ఓ ఎన్నికల అధికారి చెప్పారు. అలాగే మహిళా ఓటర్ల కోసం అందరూ మహిళా సిబ్బందే ఉండే వందకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆ అధికారి చెప్పారు. మొత్తం 11 లక్షల మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో సగటున ప్రతి పోలింగ్ బూత్‌కు అర్హులైన ఓటర్ల సంఖ్య 672 అని, దేశంలోనే ఇది తక్కువ అని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కునాల్ చెప్పారు. బరిలో ఉన్న ప్రముఖ అభ్యర్థులో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్(బిజెపి), ప్రతిపక్ష నాయకుడు దిగంబర్ కామత్( కాంగ్రెస్), మాజీ ముఖ్యమంత్రులు చర్చిల్ అలోమావో( టిఎంసి), రవి నాయక్( బిజెపి), లక్ష్మీకాంత్ పర్సేకర్( స్వతంత్ర), దివంగత మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్, ఆప్ సిఎం అభ్యర్థి అమిత్ పాలేకర్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News