Thursday, January 23, 2025

గోవా మంత్రి మండలి విస్తరణ: ఎంజిపి ఎమ్‌ఎల్‌ఎకు చోటు

- Advertisement -
- Advertisement -

Goa Cabinet expansion: Place for MGP MLA

ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం

పనాజి : గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన మంత్రిమండలిని విస్తరించారు. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజిపి) ఎమ్‌ఎల్‌ఎ సుదిన్ ధవలికర్‌తోపాటు మరో ఇద్దరు బిజెపి ఎమ్‌ఎల్‌ఎలు నీల్‌కాంత్ హలార్నకర్ , సుభాష్ ఫల్‌దేశాయ్‌లను మంత్రులుగా చేర్చుకున్నారు. ఈ కొత్తమంత్రులు ముగ్గురిచే గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై శనివారం ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, మిగతా మంత్రులు పాల్గొన్నారు. మార్చి 28న ప్రధాని మోడీ సమక్షంలో ముఖ్యమంత్రి సావంత్‌తోపాటు ఎనిమిది మంది మంత్రులు ప్రధాని మోడీ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయగా, అప్పుడు మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉండిపోయాయి.

ఇప్పుడు మరో ముగ్గురు మంత్రులకు చోటు లభించడంతో ముఖ్యమంత్రి సావంత్ తో కలుపుకుని మొత్తం 12 మంది మంత్రులతో కేబినెట్ కొలువు తీరింది. మనోహర్ పారికర్ నేతృత్వం లోను, సావంత్ నేతృత్వం లోను మంత్రివర్గాల్లో 2017 నుంచి 2019 వరకు మంత్రిగా ధవలికర్ పనిచేశారు. గత లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన మంత్రివర్గం నుంచి వైదొలిగారు. ఎంజిపి నేత ధవిలికర్‌ను ఇప్పుడు మంత్రివర్గంలో చేర్చుకోవడం దాదాపు 20 మంది బిజెపి ఎంఎల్‌ఎలకు ఇష్టం లేదు. తృణమూల్ కాంగ్రెస్‌తో ఎంజిపి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీకి నిలబడింది. ఈ పొత్తును “అపవిత్ర పొత్తు ” గా బిజెపి అప్పుడు వ్యాఖ్యానించింది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఎంజిపి రెండు స్థానాల్లో గెలిచింది. బిజెపికి బేషరతుగా ఎంజిపి మద్దతు ఇచ్చింది. మొత్తం 40 స్థానాల్లోని 20 స్థానాల్లో బిజెపి గెలవగా, ఎంజిపి, మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్‌ఎల్‌ఎల మద్దతుతో 25 స్థానాల మెజార్టీతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. చివరికి కేంద్ర బిజెపి అధిష్ఠానం రంగం లోకి దిగి కేబినెట్ లోకి ధవలికర్‌ను చేర్చుకోడానికి నిర్ణయించింది. మొదట అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన ఫల్‌దేశాయ్ శనివారం మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి ముందు ఆ పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రికి ఫల్ దేశాయ్ అత్యంత సన్నిహితుడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News