పనాజి: సర్దార్ వల్లభ్‌భాయ్‌పటేల్ మరికొంతకాలం బతికి ఉంటే గోవా త్వరగానే విముక్తి సాధించేదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గోవాకన్నా ఎంతో ముందుగానే దేశం స్వాతంత్య్రం సాధించినప్పటికీ, ఆ వేడుకను సంతోషంగా జరుపుకోలేకపోయారని ప్రధాని అన్నారు. కొంతభాగం విదేశీయుల పాలనలో ఉండటమే అందుకు కారణమన్నారు. 1961లో పోర్చుగీస్ పాలన నుంచి గోవా విముక్తి పొందింది. గోవా విముక్తి దినోత్సవం సందర్భంగా ఆదివారం పనాజిలోని డాక్టర్ శ్యాంప్రసాద్‌ముఖర్జీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు.
ప్రథమ ప్రధాని నెహ్రూ కేబినెట్‌లో ఉపప్రధానిగా ఉన్న పటేల్ 1950, డిసెంబర్ 15న మరణించారు. గోవా విముక్తి ఆలస్యం కావడంపై గతంలోనూ బిజెపి నేతలు నెహ్రూపై విమర్శలు చేశారు. గోవా విముక్తి కోసం బయటి నుంచి కూడా ఎందరో స్వాతంత్య్రయోధులు కృషి చేశారని ప్రధాని తెలిపారు. గోవా ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఎంతో కృషి చేశారని ప్రధాని అన్నారు. గోవా విముక్తి కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులతోపాటు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ విజయ్‌లో పాల్గొన్న మాజీ సైనికులను ప్రధాని ఈ సందర్భంగా సత్కరించారు.