Friday, November 22, 2024

ప్రపంచాన్ని మార్చడమే ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

174 ఏండ్లయినా ఇప్పటికీ అది చారిత్రక పత్రం
హైదరాబాద్‌లో రెడ్‌బుక్ డే సామూహిక పఠన కార్యక్రమం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచాన్ని మార్చడమే ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ లక్షమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఆ ప్రణాళికను వివిధ దేశాల్లోని నిర్దిష్టమైన పరిస్థితులకు అనుగుణఃగా అన్వయించుకుంటూ కార్యక్రమం రూపొందించుకోవాలని అన్నారు. ఫిబ్రవరి 21న ‘రెడ్ బుక్స్ డే’లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సామూహిక పఠనం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కమ్యూనిస్టు ప్రణాళికను 1848, ఫ్రిబవరి 21న మార్క్, ఏంగెల్స్ సంయుక్తంగా ప్రచురించారని గుర్తు చేశారు. అందులోని ముఖ్యాంశాలను ప్రపంచమంతా చదివి విశ్లేషిస్తున్నదని వివరించారు. పెట్టుబడిదారీ విధానం, అంతర్గత వైరుధ్యాలు అనివార్యంగా ఈ వ్యవస్థ మారిపోయి సోషలిస్టు వ్యవస్థలోకి చేరుకునే పరిణామ క్రమాన్ని కమ్యూనిస్టు ప్రణాళిక స్పష్టంగా వివరించిందని చెప్పారు.

174 ఏండ్ల కింద ఆ పుస్తకాన్ని రాసిని ఇప్పటికీ అది చారిత్రక పత్రమని అన్నారు. నేటి సమాకాలీన పరిస్థితులు అందులో కండ్లకు కట్టినట్లు ఉన్నాయని వివరించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎలా ఉందో తెలియదు గానీ, మార్క్ కాలజ్ఞానం స్పష్టంగా 174 ఏండ్ల కింద్రే పెట్టుబడి దారీ విధానం ఎలా ఉంటుందో చెప్పారని గుర్తు చేశారు. అసమానతలు పోయి అందరూ సమానంగా ఉండే సమాజం కావాలని మార్స్ ఏంగెల్స్ కోరుకున్నారని అన్నారు. దోపిడీ, అణిచవేతకు గురవుతున్న పీడితులను శాశ్వతంగా విముక్తి చేసే శక్తి కార్మికవర్గానికే ఉందన్నారు. కార్మికుడు, యజమాని అనేది పోయినప్పుడే అది సాధ్యమని చెప్పారు. పెట్టుబడిదారుల ఆస్తిని మాత్రమే రద్దు చేయడం జరుగుతుందనీ, ప్రజలు కష్టపడి సంపాదించిన సొంత ఆస్తిని రద్దు చేయబోమని స్పష్టం చేశారు.

కుటుంబ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా ఎలా మారతాయి, ప్రతిదీ డబ్బుమయం ఎలా అవుతంది, మార్కెట్‌లో పోటీ, టెక్నాలజీ వల్ల కార్మికుల జీవితాలు ఎలా ఛిద్రమవుతాయన్నది అప్పుడే కమ్యూనిస్టు ప్రణాళికలో రాశారని చెప్పారు. అనివార్యంగా కార్మికవర్గ పోరాటాలు ఎలా ముందుకొస్తాయో స్పష్టంగా ప్రకటించారని అన్నారు. మార్కిజం పట్ల ఇటీవల వస్తున్న విమర్శలు, రాజకీయ దాడులు తగ్టుకుని నిలబడాలంటే నిత్య కార్యాచరణతో అధ్యయనం కొనసాగించాలని సూచించారు. ‘పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప’ అని నినాదం ఇచ్చిన గొప్ప పుస్తకం కమ్యూనిస్టు ప్రణాళిక అని వివరించారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్, పాలడుగు బాస్కర్ పాల్గొన్నారు. ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు వక్తలను వేదికపైకి ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News