Monday, January 20, 2025

మానవ బలహీనతకు చిహ్నమే దేవుడు

- Advertisement -
- Advertisement -

‘దైవ సిద్ధాంతాన్ని వదిలి నైతిక విలువల్ని స్థాపించాలి!’ అని అన్నాడు మహా శాస్త్రవేత్త ఐన్‌స్టీన్. న్యూయార్క్ మహానగరంలో సండే స్కూల్‌లో ఆరో తరగతి చదివే ఒక విద్యార్థి తన ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో ఐన్‌స్టీన్‌కు ఒక ఉత్తరం రాశాడు. అందులో ఒక ప్రశ్న వుంది. “శాస్త్రవేత్తలు ప్రార్థన చేస్తారా? చేస్తే దేని కోసం చేస్తారూ?” అని! దానికి ఐన్‌స్టీన్ ఇలా సమాధానమిచ్చాడు. ‘ప్రకృతి సూత్రాల కనుగుణంగా ప్రతిదీ జరుగుతూ వుందన్న భావన మీద శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి. అందువల్ల ప్రార్థనతోనో, అతీంద్రియ శక్తులతోనో, ఆరాధనతోనో సహజ పరిణామాల్ని ప్రభావితం చేయవచ్చని ఏ పరిశోధకుడూ నమ్మడు’ అని ఐన్‌స్టీన్ వివరణ ఇచ్చాడు. మానవుడి సనాతన ఆలోచనా విధానాన్ని పునాదులతో పెకిలించి, శాస్త్రీయంగా, హేతుబద్ధంగా నూతన ఒరవడిలో సరికొత్త ఆలోచనా ధారను ప్రపంచ మానవాళికి అందజేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్తల్ని, సామాజిక తత్వవేత్తల్ని వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు.

ఛార్లెస్ డార్విన్ తన ‘జీవ పరిణామ సిద్ధాంతంతో సృష్టి రహస్యాల్ని ఛేదించాడు. కార్ల్‌మార్క్ ‘పెట్టుబడి’లో అదనపు విలువకున్న ప్రాముఖ్యతను ఆవిష్కరించి పెట్టుబడిదారీ వ్యవస్థను తూర్పారబట్టాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ‘మనో విశ్లేషణ’ ఫలకంపై కొత్త ఆలోచనల్ని రూపుకట్టి సరికొత్త చర్చలకు తెర లేపాడు. ఆ కోవకు చెందిన విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త ‘ఐన్‌స్టీన్ భౌతికశాస్త్రంలో ‘సాపేక్ష సిద్ధాంతంతో’ సంచలనం సృష్టించాడు. ఐన్‌స్టీన్ దృష్టిలో దేవుడంటే ప్రకృతి, ప్రకృతి ధర్మాలు మాత్రమే! ఆయన అతీంద్రియ శక్తుల్ని గాని, క్రైస్తవ మతంలోని ట్రినిటీని గాని, ఏసుక్రీస్తు మహిమల్ని గాని, ఆత్మ అమరత్వాన్ని గాని, గ్రహబలం గురించి గాని ఎప్పుడూ నమ్మలేదు.‘దేవుడు ఈ విశ్వంతో ఎప్పుడూ ఆటలాడుకోడు’ అని ఐన్‌స్టీన్ తరచుగా అంటుండేవాడు. విశ్వంలో యాదృచ్ఛికమైన గతులుండవు. గణిత సూత్రాలకు అనుగుణంగానే ప్రకృతి నడుస్తూ వుంది అని ఖచ్చితమైన అభిప్రాయం వున్నవాడాయన. ఆయన మతం’ అనే మాటకు మరొక అర్థం చెప్పాడు. దేవుడితో సంబంధం లేకుండా మనిషి నైతికతతో మెలిగి, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే ‘మతం’ అన్నాడు.

ఆ అర్థంతోనే మతం అభిమతం మానవాళికి అవసరమన్నాడు. అయితే ఈ అంశాన్ని ఆయన చెప్పిన స్థాయిలోకి వెళ్ళి ఆలోచించాల్సి వుంటుంది. అర్థం చేసుకోవాల్సి వుంటుంది. మతం, దేవుడు అనే మూఢత్వంలో కొట్టుకుపోయే జనానికి ఈ విషయం అర్థం కావడం లేదు! అయితే అర్థం కానంత క్లిష్టమైంది కూడా కాదు. వంశపారంపర్యంగా జీర్ణించుకుంటూ వచ్చిన సనాతన భావజాలాన్ని కొంచెం పక్కనపెట్టి, మెదడులో ఏ మూలో దాక్కుని వున్న హేతువును నిద్ర లేపి, విశాల హృదయంతో కొంచెం కొత్తగా ఆలోచిస్తే చాలు. ఐన్‌స్టీన్ భావం మనకు అందుబాటులో కొస్తుంది.‘మన ఈ మెటీరియలిస్టన్ యుగంలో మానవాళి శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న, తపనపడుతున్న శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, వైజ్ఞానిక రచయితలే అత్యంత విశ్వసనీయమైన మతస్థులు’ అని అన్నారాయన. మళ్ళీ ఈ అంశాన్ని కూడా అదే స్థాయిలో అర్థం చేసుకోవాల్సి వుంటుంది. వాడుకలో వున్నట్లుగా ‘మతస్థులు’ అనే పదాన్ని ‘ఒక మతాన్ని నమ్మేవారు’ అని అర్థం చేసుకోగూడదు. ఒక మహా శాస్త్రవేత్త ఉద్దేశాన్ని, స్థాయిని కొంతైనా అర్థం చేసుకోవాలని వైజ్ఞానిక స్పృహ తో ప్రయత్నించే వారికి,

తహతహలాడేవారికి తప్పక అర్థమవుతుంది. మౌఢ్యం గుంజకు తమని తాము కట్టేసుకొన్న వారికి అర్థం కాకపోవచ్చు. బంధనాల్ని తెంచుకొని స్వేచ్ఛగా ముందుకొస్తే అర్థమవుతుంది. వ్యక్తులు ఊహించుకొన్న ‘దేవుణ్ణి’ ఐన్‌స్టీన్ ఏనాడూ నమ్మలేదు. ఆ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో విస్పష్టంగా చెప్పారు కూడా! ‘తను సృష్టించిన వాటిని తానే ఆదుకోలేక, మళ్ళీ తనే శిక్షించే దేవుణ్ణి నేను ఊహించుకోలేను. హేతువుకు, భౌతిక శాస్త్ర సూత్రాలకూ వ్యతిరేకంగా ఆయన చూపే లీలల్ని కూడా నేను ఊహించుకోలేను. అసలు దేవుడంటే ఎవరు? మనిషి బలహీనతకు ప్రతిబంబం! మనిషి భయంలోంచి, అజ్ఞానంలోంచి ఊహల్లోంచి, భ్రమ ల్లోంచి రూపుదిద్దుకొన్న భగవంతుడు చూపిన లీలలకు లేదా చూపాడని చెప్పుకొంటున్న మహిమలకు ఆధారాలే లేవు. అలాంటప్పుడు మనం వాటిని నమ్మేదెట్లా? అన్నది ఐన్‌స్టీన్ సంధించిన ప్రశ్న.దేవుడనే ఊహ మానవ ప్రాథమిక శాస్త్రాల (రచనల) కల్పన. దాన్ని ఆయన ఎప్పుడూ సీరియస్ తీసుకోలేదు. మానవాతీత శక్తుగా కూడా పరిగణించలేదు. అసంపూర్ణంగానైనా, వినయంగా నమ్రతతో గ్రహించే ఈ విశ్వం క్రమబద్ధత,

దాని సామరస్యంలోని అందం మానవాళిని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆ ఆశ్చర్యాన్ని ఆనందించాలి, ఆస్వాదించాలి, అనుభవించాలి. ఐన్‌స్టీన్ అదే చేశాడు. అదే చేయమన్నాడు. అంతేకాని మరొకటి కాదు. మతానికీ శాస్త్రానికి మధ్య జరుగుతున్న ఘర్షణకు మూలకారణం వ్యక్తిగత దైవ విశ్వాసం. వైజ్ఞానిక శాస్త్రాలకు రుజువులున్నాయి. దైవ విశ్వాసానికి వుండవు. రుజువులున్న దానితో రుజువులు లేనిది ఘర్షణ పడుతోంది. రుజువులు లేని దైవ విశ్వాసం అనేది లేకపోతే మానవులంతా వైజ్ఞానిక ప్రగతిని విశ్వసిస్తారు.. అప్పుడు ఘర్షణ వుండడానికి వీలుండదు. ఇప్పుడు సమాజం ఎలా వుందీ? వైజ్ఞానిక ప్రగతి ఫలితాలను అనుభవిస్తూ దైవ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు కదా? అందుకే ఘర్షణ జరుగుతోంది. వైజ్ఞానిక ఫలితాలు అనుభవించకుండా దైవ విశ్వాసంలో బతకగలిగితే బతకాలి. అప్పుడు కూడా ఘర్షణ వుండదు. బాబాలు, స్వాములు, మాతాజీలు వగైరా సామాన్యుడి కన్నా ఎక్కువ వైజ్ఞానిక ఫలితాలు అనుభవిస్తున్నారు. మరోవైపు మూఢత్వం పెంచి పోషిస్తున్నారు. నైతికతను మరచి, అత్యంత హీనంగా ప్రవర్తిస్తున్నారు.

అందుకే ఘర్షణ. పోనీ ఈ ఘర్షణ తగ్గించడానికి సైన్స్‌ను సైన్స్ పరిశోధనల్ని పక్కన పెడదామా అంటే ఎలా వీలవుతుందీ? సైన్సు లేనిది ఊపిరే పీల్చలేం. శ్వాసక్రియ జీవశాస్త్రంలో భాగం. ఆధ్యాత్మిక, ధార్మిక, తాత్విక ధోరణులలో ఎటు నుంచి ఎటు తిప్పి చెప్పినా దైవ భావన ఉట్టి విశ్వాసమే! ఉట్టి విశ్వాసంతో సంతానోత్పత్తి జరగదు. ఆహారోత్పత్తి జరగదు. సమాజం పెరగదు. ఎదగదు. విశ్వరహస్యాల్ని, జీవరహస్యాల్ని మనిషి అర్థం చేసుకొంటూ ఒక్కొక్కటి ఆవిష్కరించుకొంటూ వస్తున్నాడు. కనుకనే, మనం ఈ అత్యాధునిక సాంకేతిక యుగంలో వున్నాం. మునుల వల్లనో, రుషుల వల్లనో, ధార్మిక ఆధ్యాత్మిక గురువుల వల్లనో ప్రపంచం పురోగతి సాధించలేదు. అలాగే మత విశ్వాసాల వల్ల ఘర్షణలు జరిగాయే గాని, శాంతి స్థాపించబడలేదు.
“ఎవరో నమ్ముకున్న దేవుడు లేడని నేనెందుకు నిరూపించాలి? అది నా పని కాదు. నమ్ముతున్న వారే, వారెందుకు నమ్ముతున్నారో నిరూపించుకోవాలి. దేవుడున్నాడని మాట్లాడితే నేనొక అబద్ధాలకోరునవుతాను. అయినా, వాస్తవాలకు నిరూపణలు వెతకొచ్చు. అవాస్తవాలకు నిరూపణ లెక్కడ?” అని ప్రశ్నించిన ఐన్‌స్టీన్ మతప్రచారకులకు కొన్ని సూచనలిచ్చాడు మత ప్రచారకులంతా తమ వ్యక్తిగత దేవుడి సిద్ధాంతాన్ని వదిలేయాలి, తమ ఆధీనంలో వున్న పాప పుణ్యాల్ని, భయాల్ని, నిరాశావాదాన్ని, పునర్జన్మల్ని మొత్తానికి మొత్తంగా తుడి చేసుకోవాలి.

మానసికంగా బలహీనులైన వ్యక్తులు ఆత్మన్యూనతా భావంతోనూ, భయంతోనూ లేదా ఎదుటివారిని మోసగించాలన్న కుట్రతోనూ అలాంటి ఆలోచనల్ని ప్రచారం చేస్తుంటారు. లేని ఆత్మల్ని జనం గుండెల్లో పదిల పర్చుతుంటారు. మతం గురించిన ప్రస్తావనలో ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్ ఒక చోట ఇలా రాసుకొన్నాడు. మతపరమైన తీవ్ర ఒత్తిళ్ళను ఆయన బాల్యంలోనే ఎలా అనుభవించాడో గుర్తు చేసుకొన్నాడు. ‘నాకు పన్నెండో యేట నుండి పాఠశాల మీద, ఉపాధ్యాయుల మీద అపనమ్మకం ప్రారంభమైంది. స్కూలు నన్ను ఫెయిల్ చేసింది. నేను స్కూలును! ఉపాధ్యాయులెప్పుడూ మిలట్రీ సార్జంట్ల లాగ ప్రవర్తించే వారు. నాకు కావల్సింది నన్ను నేర్చుకోనిచ్చేవారు కాదు. ఆ పోటీతత్వం నాకు నచ్చేది కాదు. ముఖ్యంగా క్రీడల్లో దీని వల్ల వాళ్ళు నన్ను వెళ్ళిపొమ్మని అనేక సార్లు ఆదేశించారు. మ్యూనిచ్‌లో అది ఒక క్యాథలిక్ స్కూలు. ఇక చెప్పేదేముంది? నా జ్ఞాన తృష్ణను మెలికవేసి తిప్పుతూ, తిప్పుతూ వుండేవారు ప్రెయిజ్ ద గాడ్! పైగా మార్కులు, గ్రేడ్‌లే వారి కొలబద్దలు. అలాంటి వ్యవస్థతో ఉపాధ్యాయులు పసికూనలైన చిన్నారుల మనోభావాల్ని, ఉత్సాహాల్ని,

అభిరుచుల్ని ఎలా బేరీజు వేయగలరో నాకు తెలిసేది కాదు’ ఐన్ స్టీన్ బాల్య అనుభవాలకు, సమకాలీనంలో మన బాల బాలికల జీవితానికి పెద్దగా తేడా లేదు. మిషనరీ స్కూలయితే ప్రేయర్. మదరసా అయితే అల్లా, వేదపాఠశాల అయితే వేదాలు. అంతే. మతప్రమేయం లేకుండా విచక్షణా జ్ఞానాన్ని పెంచే చదువులున్నాయా? వాస్తవాలేవో, భ్రమలేవో, కల్పనలేవో పిల్లలకు విడమరిచి చెపుతున్నామా? మతం సాధించే విజయానికి, విద్యా వ్యవస్థ అపజయానికి నేరుగా అవినాభావ సంబంధం వుంది.
సరే, గతం గడిచిపోయింది. ఏం చేసినా దాన్నిక మార్చలేం కాని, సుఖాంతమయ్యే ఒక కొత్త ప్రారంభానికి మనం బీజం వెయ్యొచ్చు కదా? ఆ దిశలో మనం ఎందుకు ఆలోచించకూడదు? థియోసఫీ, స్పిర్చువలిజం వంటివన్నీ మత గ్రంథాల చుట్టూ తిరిగే గందరగోళాలే! అసలు మత గ్రంథాలన్నీ అవాస్తవాలు, కల్పిత గాథలు అని అనుకున్న వారికి కొత్త ఆలోచనలు వచ్చే అవకాశముంటుంది. గానుగెద్దులా కళ్ళు మూసుకొని తిరిగే వారికి,

అందులోనే శాంతి, సౌఖ్యం వున్నాయని అనుకనే వారికి మనం ఏమీ చెప్పలేం. వైజ్ఞానిక శాస్త్రం నైతికతను కించపరుస్తుందన్న అపవాదు వుంది. కాని అది నిజం కాదు! మానవుడి నైతిక ప్రవర్తన సానుభూతి, విద్య, వైద్యం, సామాజిక అవసరాలు, స్నేహ బంధనాల మీద ఆధారపడి వుంటుంది. అందులో మతానికి చోటే లేదు. అవసరమే లేదు. మత ప్రమేయం లేకుండా కూడా, మానవులుగా, మహనీయులుగా గొప్ప విలువలతో జీవించిన వారున్నారు. మరణం తర్వాత లభించే అనుగ్రహం కోసమో, శిక్షలకు గురవుతామన్న భయంతోనే మనిషిని నిలదీయడం గాని, కృంగదీయడం గాని, మోసగించడం గాని, అమానుషం! అపరిపక్వం! అసంబద్ధం!!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News