అదానీ, అంబానీ సాయానికే ఆయన ఉన్నారు
రైతులు, కూలీలకు సేవ చేయడానికి కాదు
యుపిలో రాహుల్ వ్యంగ్యోక్తి
దేవ్‌రియా (యుపి) : కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీపై మరొక సారి విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీకి, ముఖేష్ అంబానీకి సాయం చేయడానికే ప్రధాని మోడీని ఆయన ‘పరమాత్మ (భగవంతుడు)’ పంపాడని రాహుల్ ఆక్షేపించారు. తనను ‘భగవంతుడు పంపాడు’ అని ప్రధాని మోడీ ఒక ఇంటర్వూలో చేసిన వ్యాఖ్యకు రాహుల్ అలా స్పందించారు. రాహుల్ గాంధీ యుపి దేవ్‌రియాలో ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ, మోడీని భగవంతుడు రైతులు, కూలీలకు సేవ చేయడానికి పంపలేదని అన్నారు. ‘ప్రతి ఒక్కరూ జీవసంబంధం ఉన్నవారు. కాని నరేంద్ర మోడీజీ జీవసంబంధం ఉన్నవారు కాదు.
అంబానీ, అదానీలకు సాయం కోసం ఆయనను పరమాత్మ పంపాడు. కానీ పరమాత్మ ఆయనను రైతులు, కూలీలకు సాయం కోసం పంపలేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు. ‘మోడీ వాలె పరమాత్మ’ అని ప్రధాని మాట్లాడుతున్నారని రాహుల్ అన్నట్లు ‘ఎఎన్‌ఐ’ తెలిపింది. ‘పరమాత్మ ఆయనను పంపినట్లయితే, ఆయన నిరుపేదలు, రైతులకు సాయం చేసి ఉండేవారు. యెహ్ కైసే పరమాత్మ హైఁ? యెహ్ నరేంద్ర మోడీజీ వాలె పరమాత్మ హైఁ. (ఈయన ఏ రకం భగవంతుడు? ఈయన పిఎం మోడీ భగవంతుడు)’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. తాను అగ్నిపథ్ పథకాన్ని చించివేసి చెత్తబుట్టలో పడవేస్తానని రాహుల్ ర్యాలీలో వాగ్దానం చేశారు. ఇండియా కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్‌పై 50 శాతం పరిమితిని అంతం చేస్తుందని ఆయన చెప్పారు. ఇండియా కూటమి రాజ్యాంగాన్ని కాపాడుతుందని రాహుల్ స్పష్టం చేశారు.