Friday, November 22, 2024

భద్రాద్రి ‘గజగజ’

- Advertisement -
- Advertisement -

ప్రళయ భీకరంగా పోటెత్తిన గోదావరి

ఏక్షణానికి ఏం జరుగునో.. గంటకు 10 సెం.మీ. పెరుగుతున్న
వరద 72 చేరిక రెండో అతిపెద్ద వరదగా రికార్డు
75 అడుగులు దాటుతుందని అంచనాలు కరకట్టల సామర్థం
80 అడుగులు సీపేజీలతో వణికిస్తున్న ఏటిగట్లు ఇదే పరిస్థితి
కొనసాగితే పెనుముప్పు పోలవరం బ్యాక్ వాటర్‌తో పెరుగుతున్న
నీటి స్థాయి ఆందోళనలో జనం.. రంగంలోకి ఆర్మీ పరిస్థితిని
సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రి పువ్వాడ అజయ్‌కు ఫోన్
సిఎం కెసిఆర్ భద్రాద్రికి హెలీకాఫ్టర్, రక్షణ సామగ్రి

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి తీరం ప్రళయ గోదావరిని తలపిస్తోంది. సుడులు తిరుగుతూ మహోగ్రరూపంలో గోదారమ్మ భద్రాచలం తీర ప్రాంత గోదావరివాసులను కలవరపెడుతోంది. గోదారమ్మ ఏ కోశానా శాంతించేలా కన్పించకపోవడంతో అటు అధికార యంత్రాంగం, ఇటు జనాల్లోనూ ఒక్కటే ఆందోళన. ఏ క్షణంలో ఎటువంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న జనం గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే భద్రాద్రి వద్ద గోదావరి వరద నీటి మట్టం 72 అడుగులకు చేరింది. రాత్రికి అదికాస్తా 75అడుగులకు చేరే అవకాశం ఉందంటున్నారు. శనివారం ఉదయానికి 80అడుగులు చేరుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో భద్రాద్రి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి భద్రాచలం చుట్టూ ఉన్న కరకట్ట ఎత్తు 80అడుగులు. అయితే వరద ప్రవాహ పరిస్థితి ఇంతలా ఉంటే కరకట్ట ఎంతవరకూ సేప్ అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వరద పరిస్థితి ఇలానే కొనసాగితే కరకట్టపైనుంచి సైతం నీళ్లు పారే ప్రమాదం ఉందంటున్నారు. అదే సమయంలో ఎటిగట్లకు లీకేజీల భయం కూడా వెంటాడుతోంది. రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఏటిగట్ల భవితవ్యం కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అయితే వర్షాలు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నా వరద ప్రవాహం మాత్రం తగ్గడం లేదు.

ఎగువన కురుస్తున్న వానలు గోదావరి పరివాహక ప్రాంత ప్రజల పాలిటశాపంగా మారుతోంది. భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరికనుదాటి 70 అడుగులకుపైగా దాటిన ప్రవాహం గంటగంటకు పెరుగుతూ అటు ప్రజాప్రతినిధులు, అధికారులు ఇటు ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే నలువైపుల రహదారులు మూసుకుపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన భద్రాచలం వాసులకు పెరుగుతున్న వరద నీరు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకునేలా చేస్తుంది. ఇప్పటి వరకు ప్రజలకు శ్రీరామరక్షగా పనిచేసిన కరకట్టపై నుంచి కూడా వరద పోటెత్తే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం దీని ఎత్తు 80 అడుగులు కాగా 1986 ఏడాదిలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎన్‌టిఆర్ హయాంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో కరకట్ట నిర్మాణం జరిగింది. అయితే ఇప్పుడు నీటి ప్రవాహం దానిని కూడా అదిగమించే ప్రమాదం ఉందంటున్నారు. బ్రిడ్జిని ఆనుకుని వరద నీరు పరవళ్ళు తొక్కుతుండడంతో గురువారం నుంచే ఈ వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. శుక్రవారం పట్టణంలోకి కూడా వరద నీరు చేరి జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపచేసింది.

డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించిన ఈ దృశ్యాలు చూస్తే భద్రాద్రి ఏ స్థాయిలో ప్రమాదపుటంచుల్లో ఉందో అర్థమవుతుంది. ఇప్పటివరకు ప్రాణనష్టం జరగకుండా ప్రజ్రాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిక్షణం మంత్రి పువ్వాడతో ఫోన్‌లో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఆర్మీ హెలికాప్టర్లను, వాహనాలు, లైఫ్ జాకెట్లను సిద్ధం చేశారు. ఇప్పటికే 50 పునరావాస కేంద్రాల్లో ప్రజలు తలదాచుకుంటున్నారు. మిగిలిన వారు కూడా ఇళ్లల్లో ఉండరాదని, వరద ప్రవాహం పెరిగే ప్రమాదం ఉన్నందున సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ అనుదీప్, ప్రభుత్వ చీఫ్ విప్ రేగా కాంతారావు కాలనీల్లో తిరుగుతూ మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. వందేళ్ళ చరిత్రలో ఈ స్థాయి నీటి ప్రవాహాన్ని చూడలేదని భద్రాద్రి వాసులు చెపుతున్నారు. సమీపంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల బ్యాక్ వాటర్ తోడై ఈ పరిస్థితి తలెత్తిందని, ఇప్పటికైనా దాని డిజైన్ మార్చాలని ఇంజనీరింగ్ నిపుణులు సూచిస్తున్నారు.

లేదంటే భవిష్యత్తులో మరింత పెనుప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. జలమయమైన గోదావరి నది పరిసర ప్రాంతాల్లో ప్రజలు నివాసాల్లో ఇబ్బంది ఉంటే తక్షణమే సమాచారం ఇవ్వాలని, డయల్ 100కు ఫోన్‌చేస్తే అత్యవసర సహాయం అందిస్తామని ఎస్‌పి డాక్టర్ వినిత్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ స్తంభాలు నీట మునగడంతో ఇళ్లల్లో కరెంటులేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వరద గోదావరి శాంతించితే తప్ప ఇక్కడ ప్రజల కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భద్రాచలంలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠతో ఆందోళన చెందుతున్నారు. తమ బంధువులు, కుటుంబసభ్యుల క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News