Thursday, January 23, 2025

భారీ వర్షాలతో గోదావరిలో పెరుగుతున్న వరద

- Advertisement -
- Advertisement -

Godavari River receives Huge floods

భారీ వర్షాలతో గోదావరిలో పెరుగుతున్న వరద
ఎస్సార్పెసీ 28గేట్లు ఎత్తివేత
పోటేత్తిన మంజీరా.. నిజాంసాగర్‌కు వరద ఉధృతి
లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంక
కడెం ప్రాజెక్టు 8గేట్లు ఎత్తివేత
నిలకడగా కృష్ణమ్మ.. శ్రీశైలంకు 2.98లక్షల క్యూసెక్కులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం వరద నియంత్రణ చర్యలు చేపట్టింది. గోదావరి నది పరివాహకంగా ప్రజలను అప్రమత్తం చేస్తోంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయి 90టిఎంసీల నీటినిలువ సామర్ధానికి గాను, ఇప్పటికే 99శాతం నీటితో నిండివుంది. ఆదివారం ఎగువ నుంచి 1.75లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా ,ప్రాజెక్టు 28గేట్లు ఎత్తివేశారు. రిజర్వాయర్ నుంచి 1.57లక్షల క్యూసెక్కుల నీటని బయటకు విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు 55వేలక్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 3.43లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 3.04లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టులో ఇప్పటికే 86శాతం నీటితో నిండివుంది. ఎగువ నుంచి 64,437క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు 8గేట్లు ఎత్తివేసి 67664క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు దిగువన కడెం నదీపరివాహకంగా ఉన్న లోతట్టు గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
పోటేత్తిన మంజీరా.. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.నది పరివాహకంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 35179క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు దిగువన వాగులు వంకలు ఏకంకావటంతో మంజీరా నదిలో వరద ఉధృతి మరింత అధికమైంది. దిగువన నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 58వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా ప్రాజెక్టు మొత్తం గేట్లు ఎత్తివేశారు. జలాశయం నుంచి 82వేల క్యూసెక్కు ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టులోకి 42వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 49591క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లోయర్ మానేరు ప్రాజెక్టులోకి 96543క్యూసెక్కుల నీరు చేరుతోంది.ప్రాజెక్టులో ఇప్పటికే 97శాతం నీరు నిలువ ఉంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరదను నియంత్రిస్తూ గేట్లు తెరిచి దిగువకు 96549క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నారు.
నిలకడగా కృష్ణమ్మ:
కృష్ణానదిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు 1.80లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 1,86,681క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. కృష్ణాకు ప్రధాన ఉపనదులుగా ఉన్న తుంగభద్రతోపాటు వేదవతి, హంద్రీ నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,98,618క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 2,23,566క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డి పాడుహెడ్ రెగ్యులేటర్ ద్వారా 10వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారా 1000క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 800క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు కుడి , ఎడమ గట్ల జలవిద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ 62,096క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మొత్తం 2,23,566క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.
సాగర్ 20గేట్లు ఎత్తివేత:
నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 2,71,546క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు 20గేట్లు తెరిచి దిగువకు అంతే నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన పులిచింతల ప్రాజెక్టులోకి 3.18లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, దిగువకు 2.40లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసి ప్రాజెక్టులోకి 7715క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి దిగువకు 4241క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Godavari River receives Huge floods

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News