Thursday, September 19, 2024

గజ్వేల్‌కు చేరిన గోదారమ్మ

- Advertisement -
- Advertisement -

Godavari water

 

కొండపోచమ్మ సాగర్ దిశగా పరుగులు పెడుతున్న జలసిరి
అక్కారం పంపు హౌస్‌కు త్వరలో చేరనున్న జలప్రవాహం

మన తెలంగాణ/గజ్వేల్ : రైతు ఆత్మహత్యల జిల్లా,కరువు జిల్లాగా చరిత్ర కెక్కిన సిద్దిపేట జిల్లా గోదారమ్మ రాకతో సస్యశ్యామలం కాబోతోంది.

అన్నదాతలంతా సంతోషంతో రెండు పంటలు నిరాటంకంగా పండించుకునే అవకాశం ఏర్పడింది. కరెంటుతో కానీ , వానలతో కానీ పనిలేకుండా కాలువలు చెరువుల తో పం టలకు పుష్కలంగా నీరందించే అవకాశా న్ని అపర భగీరధుడైన సిఎం కెసిఆర్ ఆలోచనతో మంత్రి హరీష్ రావు అకుంఠిత దీక్ష తో ఒనగూడింది… సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ సర్జిపూల్ నుంచి గోదావరి జలాలు బుధవారం సాయంత్రం సిఎం కెసిఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ నియోజకవర్గంలోకి చేరాయి. కాలువల ద్వారా నీటి ప్రవాహం మెల్లమెల్లగా గజ్వేల్ మండలం కొండకండ్ల -రిమ్మన గూడ మధ్య ఉన్న కాలువలోకి చేరింది.

సిఎం నియోజకవర్గాన్ని గోదారమ్మ ముద్దాడిన వేళ అక్కడ అప్పటికే ఎదురు చూస్తున్న అన్నదాతలు, యువకులు, టిఆర్‌ఎస్ కార్యకర్తలు ఆనందంతో కేరింతలు కొట్టారు. హర్షాతిరేకంతో జైతెలంగాణ..జై కెసిఆర్ అంటూ మిన్నుముట్టే నినాదాలు చేశారు. రిమ్మన గూడ, దాతారుపల్లి, కొడకండ్ల గ్రామాలకు చెందిన ప్రజలు గోదారి నీళ్ళు కాలువలోకి పరుగులు తీస్తున్న అద్భుత దృశ్యాలు చూసి మురిసిపోయారు. ఎక్కడి గోదావరి నీళ్లు తమ గ్రామాలకు రావటం ఏంటని ఆశ్చర్యంతో కాలువలోకి దిగి నీటిని తీసుకుని తలలపై చల్లుకున్నారు. ఉత్సాహంగా నీటిని పరస్సరం జనం చల్లుకుని సంబురపడ్డారు. రైతు ఆత్మహత్యల జిల్లా గా పేరున్న ఈ ప్రాంతానికి అపర భగీరధుడైన సిఎం కెసిఆర్ అద్భుతమైన ఆలోచనకు తోడు నిరంతరం శ్రమించే మంత్రి హరీష్ రావు, కలెక్టర్ వెంకట్రాంరెడ్డిల కృషితో ఈ ప్రాంతంలో పనులు చురుగ్గా సాగాయి. ఇంజనీర్ల రీడిజజైన్‌తో కాలేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన సాగి రికార్డు సమయంలో దాదాపు పూర్తి కావచ్చింది.

ఫలితంగా కరువును శాశ్వతంగా పారదోలి బీడుభూములను సైతం పవిత్ర గోదారి జలాలతో సస్యశ్యామలంగా మార్చగల అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 6వందల మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి కొండపోచమ్మ సాగర్ జలాశయం నింపబోతున్నారు. బుధవారం సాయంత్రం కాలువ ద్వారా జల ప్రవాహం గజ్వేల్ నియోజకవర్గలోని కొండపోచమ్మ దిశగా అడుగులు వేస్తోంది. బుధవారం సాయంత్రానికి గోదావరి జలాలు గజ్వేల్ మండలం కొడకండ్ల -రిమ్మన గూడ కాలువ సమీపంలోని గేటువరకు చేరాయి. అక్కడ గేట్ల ద్వారా దాతారుపల్లి- అక్కారం కాలువలోకి నీళ్లు గురువారం మధ్యాహ్నం వరకు చేరుకునే అవకాశముందని భావిస్తున్నారు. అక్కారంలో సంపు హౌజ్ నిండటంతోనే భారీ మోటార్ల ద్వారా నీటిని కొండపోచమ్మ కాలువలోకి( మర్కూక్ కాలువ)లోకి పంపింగ్ చేయనున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్ చేసే అరుదైన ఘట్టాన్ని త్వరలో సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభించ బోతున్నారు.

టిఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలు

గజ్వేల్ నియోజకవర్గంలో బుధవారం గోదావరి జలాలు ప్రవేశించి కొండపోచమ్మ సాగర్ వైపు అడుగులు వేస్తున్న అద్భుతం ఆవిష్కృతమైన నేపధ్యంలో టిఆర్‌ఎస్ నేతలు కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ ఛైర్మన్ జకీయొద్దీన్, టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మాదాసు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు బెండె మధు తదితరులు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి గోదావరి జలాలతో అభిశేకం చేశారు. కార్యకర్తల నినాదాల మధ్య అభిశేకం చేసిన అనంతరం విగ్రహం వద్ద సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావుల ఫ్లెక్సీకి క్షీరాభిశేకం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ రాజమౌళి గుప్త,టిఆర్‌ఎస్ నాయకుడు మాదాసు శ్రీనివాస్‌లు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గానికి గోదావరి నీళ్లు చేరటం అరుదైన సంఘటన అన్నారు. కొండ పోచమ్మ సాగర్ ద్వారా నిరంతరం సాగునీటితో ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని వారన్నారు. అన్నదాతల ఆత్మహత్యలకు, కరువుకు ఇక ఈ జిల్లా చెల్లుచీటీ ఇచ్చినట్లేనని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News