Sunday, December 22, 2024

ఉగ్ర గోదావరి

- Advertisement -
- Advertisement -

మంగళవారం సాయంత్రానికి 51.5 అడుగులకు
చేరిన నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ అనుదీప్

మన తెలంగాణ/భద్రాచలం: భారీ వర్షాలు, ఎగువన ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కారణంగా మళ్లీ గోదావరికి వరద పోటెత్తింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రానికి గోదావరి నీటి మట్టం 51.4 అడుగులకు చేరింది. నీటిమట్టం 48అడుగులకు చేరగానే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వరద నీటి కారణంగా గోదావరి నీటి మట్టం గంటగంటకు పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్ర జలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో 13లక్షల 46వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను బట్టి అర్ధరాత్రికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకా శం ఉంది. అధికారులు వరద పరిస్థితి, సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వరద పెరిగితే ప్రజలను పునరావాస కేంద్రాల్లోకి తరలించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రమాదాలు సంభవిస్తాయని కలెక్టర్ సూచించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం, ఐటిడిఎ పిఓ కార్యాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే కంట్రోల్ రూంను సంప్రదించాలని ప్రజలకు అధికారులు సూచించారు. వరద నీరు పట్టణంలోకి రాకుండా కరకట్టల వద్ద స్లూయిజ్‌ల్లోకి వచ్చే నీటిని అవసరమైన మేర మోటార్లను ఉపయోగించి ఎప్పటికప్పుడు గోదావరిలోకి తోడాలని ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని గతంలోలా సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అధికారులను కోరారు.

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి పరివాహకంగా జైక్వాడ్ నుంచి బాబ్లీ ప్రాజెక్టు దాక ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి వస్తున్న వస్తున్నట్టుగా దిగువకు వదలుతున్నారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి 1,26,190క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 76,790క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి దిగువన ఉప నదులు కలయికతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 3,77,559క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు గేట్లు తెరిచి 3,63,531క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్ర , చత్తీస్‌గడ్‌లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తుపాకుల గూడెం, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల అన్నిగేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం రాత్రికి 52అడుగులు చేరే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దిగువన ఏపిలో ధవళేశ్వరం వద్ద గోదావరిలో నీటి ప్రవాహం 11లక్షల క్యూసెక్కులు దాటిపోయింది. అధికారులు మోదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కాటన్ బ్యారేజి అన్నిగేట్లు ఎత్తివేశారు.దిగువన గోదావరినదికి ఇరువైపుల ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

నిలకడగా కృష్ణమ్మ.. శ్రీశైలంలో 3లక్షల ఇన్‌ఫ్లో

కృష్ణానదిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 3లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 3,24,048క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. దిగువన నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి 2.80లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి అంతే నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. మూసినదిలో 8181క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. మూసి ప్రాజెక్టు నుంచి 3688క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News