Friday, November 22, 2024

మిడ్‌మానేరుకు చేరిన గోదావరి జలాలు

- Advertisement -
- Advertisement -

గోదావరి పరివాహకంగా ఉన్న రిజర్వాయర్లు జలకలను సంతరించుకుంటున్నాయి. ఎగువ నుంచి నదిలో నీటి ప్రవాహాలు క్రమేపి పెరుగుతూ వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల ఎత్తిపోత పుంజుకుంది. పంపుల నుంచి నీటి ఎత్తిపోత ప్రారంభమైన 24గంటల్లోనే ఆదివారం నాటికే గోదావరి నదీజలాలు మిడ్ మానేరు జలాశాయంలోకి చేరుకున్నాయి. ధర్మారం మండలం నంది పంపుహౌస్‌లో నాలుగు మోటార్లనుంచి ,రామడుగు మండలంలో గాయత్రి పంపుహస్‌లోని నాలుగు మోటార్ల నుంచి నీటి ఎత్తపోతల కొనసాగుతోంది. ఈ పంపుహౌస్‌ల ద్వారా 12600క్యూసెక్కల నీటిని తోడిపోస్తున్నారు. రోజుకు 1.50టిఎంసీల మేరకు గోదావరి నదినుంచి ఎత్తిపోస్తున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ సీజన్‌లోనే కాళేశ్వరం పధకంలోని అన్ని రిజర్వాయర్లను నింపనున్నారు.

ఈ పథకంలో అత్యంత ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవటం , దాని ఎగువన ఉన్న అన్నారం బ్యారేజికి , సుందిళ్ల బ్యారేజిలలో బుంగలు పడటం ,నీటీ లీకేజి సమస్యలు ఏర్పడటంతో కేంద్ర జలసంఘం నియమించిన జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నిపుణులు సూచించిన మేరకు ఈ బ్యారేజిలలో నీటి నిలువ , వాటి నుంచి నీటి ఎత్తిపోతను ఈ సీజన్‌కు పక్కన పెట్టేశారు. ఈ బ్యారేజిలకు సమస్యలు ఏర్పడకుండా ఉంటే ఈ పాటికి ప్రాణహిత నదిద్వాకా మేడిగడ్డ వద్ద గోదావరిలో కలుస్తున్న నీటిని మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజికి, అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజికి , తిరిగి సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోసే కార్యక్రమం ప్రారంభమై ఉండేది. ఎగువ నుంచి గోదావరి నదిద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతున్న నీటినే కాళేశ్వరం రిజర్వాయర్లలోకి పంప్ చేస్తున్నారు.

గరిష్ట స్థాయికి ఎల్లంపల్లి:
ఎగువన మహారాష్ట్ర నుంచి శ్రీరాం సాగర్‌ప్రాజెక్టులోకి 22846క్యూసెక్కల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో గరిష్ట స్థాయి నీటినిలువ సామర్దం 80.50టిఎంసీలు కాగా ఇప్పటివరకూ 32.90టిఎంసీల నీరు చేరింది. కడెం ప్రాజెక్టులోకి 6763క్యూసెక్కలు ప్రవాహం వస్తుండగా , 5143క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టులో నీటి నిలువ 7టిఎంసీల గరిష్టస్థాయికి చేరువలో ఉంది. దిగువన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 20653క్యూసెక్కు నీరు చేరుతోంది. ఇందులో 12931క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20టిఎంసీలు కాగా ఇప్పటికే 17.81టిఎంసీల నీరు నిలువ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News