Friday, December 20, 2024

మండు వేసవిలో ‘నిండుగా నీళ్లు’

- Advertisement -
- Advertisement -

Godavari waters Release to Gandicheruvu

మంచినీటికి కటకటలాడిన ప్రాంతానికి గోదావరి జలాలను
తెచ్చి కరువును దూరం పెట్టాం మల్లన్న సాగర్‌కు ప్రతిపక్షాలు
ఎన్నో అడ్డంకులు సృష్టించాయి సేకరించిన భూమిని
రియల్ ఎస్టేట్‌కు ఉపయోగిస్తారని దుష్ప్రచారం చేశాయి
కెసిఆర్ పట్టుదల గలిగిన నాయకుడు కాళేశ్వరం
ద్వారా మల్లన్న సాగర్‌లోకి నీళ్లు దుంకించారు మల్లన్న
పాదాలను గోదావరి జలాలతో కడిగినట్టే లక్ష్మీ నరసింహ
స్వామి పాదాలకు వాటితో అభిషేకం చేయిస్తాం ఒక్క
బిజెపి పాలిత రాష్ట్రంలోనైనా ఉచిత కరెంటు, రూ.2వేల
పెన్షన్, కల్యాణలక్ష్మీ అమలు చేస్తున్నారా? : గజ్వేల్
మండలంలోని మల్లన్న ద్వారా యాదాద్రి జిల్లాలోని
గండి చెరువుకు విడుదల చేస్తూ మంత్రి హరీష్ రావు

మన తెలంగాణ/గజ్వేల్ రూరల్ : మంచినీటికి గోసపడ్డ ప్రాంతంలో గోదావరి జలాలను తెచ్చి కరువును దూరం పెట్టాం.. మండుటెండల్లో కూడా గోదావరి నీళ్లు రావడమనేది ఓ కల.. నీళ్లు కళ్ల ముందే ప్రవహిస్తున్నా ప్రతిపక్షాలకు అవి కనబడటం అయినా పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కొమురవెల్లి మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను యాదాద్రి భువనగిరి జిల్లాలోని గండి చెరువుకు, కొండపోచమ్మ కాలువ ద్వారా కూడవెళ్లి వాగులోకి ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండు టెండల్లో కూడవెల్లి వాగులోకి, ఆట్లాగే ప్యాకేజి 16 కాలువలోకి సాగునీరును విడుదల చేయడం ఆ నందంగా ఉందన్నారు. నిండు వేసవిలో గోదావరి జలాలను వాగుల్లోకి, కాలువల్లోకి సమృద్ధిగా విడుదల చేసిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. గత వేసవిలో కూడవెల్లి వాగు కు గోదావరి జలాలను విడుదల చేసి 38 చెక్ డ్యాంలను నింపి, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గంలోని 30నుంచి 40వేల ఎకరాలలో కోట్లాది రూపాయల పంటను కాపాడగలిగామన్నారు.

హల్ది వాగులోకి గోదావరి జలాలు విడుదల చేయడం ద్వారా నుంచి మంజీరలోకి దాన్నుంచి నిజాం 96 కిలోమీటర్ల మేర ప్రయాణించి వర్గల్‌లోని చెరువులతోపాటు భూగర్భ జలాలు గణనీయంగా పెరిగేలా చేస్తున్నామన్నారు. కాళేశ్వరం గుండెకాయ లాంటి మల్లన్న సాగర్ జలాశయం నిర్మాణం చేపడితే ప్రతిపక్షాలు ప్రాజెక్టు పూర్తి కాకుండా చేయాలన్న ఉద్దేశంతో ప్రజలను రెచ్చగొట్టాయని గుర్తుచేశారు. ఇక్కడికి గోదావరి నీళ్లు తేవడం ఆసాధ్యమంటూ ప్రజల నుంచి తీసుకున్న భూములను రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగిస్తారని ప్రజల్లో అపోహలు స్పృష్టించే ప్రయత్నం చేశారన్నారు. పట్టుదల కలిగిన నాయకుడు కెసిఆర్ కాళేశ్వరం ద్వారా మల్లన్న సాగర్‌కు గోదావరి జలాలు వచ్చేలా చూశారన్నారు. కొమురవెల్లి మల్లన్నసాగర్ ద్వారా గోదావరి జలాలను యాద్రాద్రి భువనగిరి జిల్లాలోని గండిచెరువు ప్యాకేజీ 15 కాలువ ద్వారా నీరు విడుదల చేశామని తెలిపారు. రేపు గండి చెరువుకు గోదావరి జలాలు చేరుకుంటామని, ఇటీవల కొమురవెల్లి మల్లన్న పాదాలను గోదావరి జలాలతో అభిషేకించిన మాదిరే లక్ష్మినరసింహ్మస్వామి పాదాలను గోదావరి జలాలతో అభిషేకిస్తామన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తాను పాలిస్తున్న ఒక్క రాష్ట్రంలోనైనా రైతులకు ఉచిత కరెంట్, 2వేల పెన్షన్, కళ్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా అని హరీశ్ ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో యాసంగి పంట అక్కడక్కడ అరుదుగా మాత్రమే కనబడేదని, ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోనే రెండు లక్షల 55 వేల ఎకరాలలో వరి సాగు అవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే ఇది సాధ్యమయ్యేదా అన్నది ప్రజలు ఆలోచించాలన్నారు. పామాయిల్ సేద్యానికి ప్రభుత్వం ఆసరాగా ఉంటుందన్నారు.

కేంద్రంలో ఖాళీగా ఉన్న ఆరు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాల నియామకానికి ఇటీవల 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేన్ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. చెరువులు పుష్కలంగా జలాలతో నిండి. ముదిరాజ్‌లు, గంగపుత్రులు మంచిగా బతుకుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అందరికి సమన్యాయం జరుగుతుందన్నారు. అంతకు ముందు జలాల విడుదల కోసం ఆయన కొడకండ్ల వద్దకు చేరుకోగానే మంగళహారతులు, డప్పు చప్పుళ్లతో రైతులు ప్రజలు ఘనస్వాగతం పలికారు. వేసవిలో కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేయడంపై సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు మంత్రికి నాగలినీ బహూకరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్పన్ రోజా రాధాకృష్ణశర్మ, ఈఎన్‌సి హరిరాం, ఎంఎల్‌సిలు యాదవ రెడ్డి, రఘోత్తం రెడ్డి, ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎఈలు వేణు, శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News