కర్నాటకలో గోద్రా తరహా ఘటనకు అవకాశం
కాంగ్రెస్ ఎంఎల్‌సి అనుమానం
బెంగళూరు: అయోధ్యలో ఈ నెల 22న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం జరగనున్న నేపథ్యంలో గోద్రా తరహా ఘటన కర్నాటకలో సంభవించే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు బికె హరిప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం నాడిక్కడ మాజీ రాజ్యసభ సభ్యుడైన హరిప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఇదే సందర్భంలో గుజరాత్‌లోని గోద్రాలో కరసేవకుల దహనం జరిగిన కారణంగా కర్నాటక ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
2002లో గోద్రాలో జరిగిన రైలు దహనం సంఘటన గుజరాత్‌లో అత్యంత దారుణమైన మత ఘర్షణలకు దారితీశాయి. కర్నాటకలో కూడా అటువంటి పరిస్థితినే సృష్టించవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అవాంఛనీయ సంఘటన ఏదీ జరగడానికి ఎటువంటి అవకాశం ఇవ్వరాదని ఆయన అన్నారు. అయోధ్యకు వెళ్లదలచుకున్నవారికి అన్ని ఏర్పాట్లు కల్పించాలని ఆయన కోరారు. గోద్రా తరహా ఘటనలు జరిగే అవకాశంపై తన వద్ద సమాచారం ఉందని, కొన్ని సంస్థల అధిపతులు ఇటీవల కొన్ని రాష్ట్రాలకు వెళ్లి అక్కడి బిజెపి నాయకులు కొందరిని రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు.