Saturday, December 21, 2024

గోద్రా రైలు దహనకాండ.. 17 ఏళ్ల తర్వాత దోషికి బెయిల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గుజరాత్ లోని గోద్రా రైలు దహనకాండ కు సంబంధించిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ దోషికి సుప్రీం కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఆ వ్యక్తి 17 ఏళ్ల పాటు జైల్లోనే ఉన్న కారణంగా అతడికి బెయిల్ ఇస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం స్పష్ట చేసింది. ఈ కేసులో మరికొందరు దోషులు కూడా బెయిలు కోసం దరఖాస్తు చేసుకోగా, ఆ పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వేస్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పంటించడంతో ఎస్6 బోగీ లోని 59 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ ఘటన సమయంలో బోగీపై రాళ్లదాడికి పాల్పడినందుకు గాను ఫారూక్ సహా మరి కొందరికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇదిలా ఉండగా, తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కొందరు దోషులు ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వీటిపై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనం విచారణ చేపట్టింది. 17 ఏళ్ల పాటు అనుభవించిన జైలు శిక్షను పరిగణన లోకి తీసుకుని, బెయిల్ మంజూరు చేయాలంటూ ఫారుక్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలను అంగీకరించి ధర్మాసనం అతడికి బెయిల్ మంజూరు చేసింది. అయితే మిగతా పిటిషన్లపైనా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

దోషుల బెయిల్ పిటిషన్లను అంతకు ముందు గుజరాత్ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దోషులు చేసింది సాధారణ రాళ్ల దాడి కాదని, వీరివల్ల బోగీ లోని ప్రయాణికులు బయటకు రాలేక పోయారని కోర్టుకు వివరించారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన అగ్నిమాపక సిబ్బంది పైనా వీరు రాళ్లు విసిరారని తెలిపారు. గోద్రా రైలు దహనకాండ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అల్లర్లకు దారి తీసింది. ఈ ఘటన తరువాత చెలరేగిన ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News