Sunday, December 22, 2024

భాగ్యనగరంలో నేడే తొలి బోనం

- Advertisement -
- Advertisement -

డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులు, శివసత్తుల ఆటలు, పోతురాజుల వీరంగాలతో
హోరెత్తనున్న నగరం
ఆగష్టు 4వ తేదీ వరకు బోనాల ఉత్సవాలతో హైదరాబాద్‌లో సంబురాలు

మనతెలంగాణ/హైదరాబాద్: ఆషాఢం వచ్చేసింది…. నేడే భాగ్యనగరం తొలి బోనం ఎత్తుకోనుంది. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులు, శివసత్తుల ఆటలు, పోతురాజుల వీరంగాలతో భాగ్యనగరం హోరెత్తనుంది. కళ్లకు కట్టే భవిష్యవాణులు, ఫలహారపు బళ్ల ఊరేగింపులతో నగరం కనువిందు చేయనుంది. నేటి నుంచి బోనాల సంబురాలు ప్రారంభంకానున్నాయి. ఏటా ఆషాఢమాసంలో వచ్చే తొలి గురు లేదా ఆదివారం నుంచి బోనాల జాతర మొదలవుతుంది. ఈ ఏడాది అమావాస్య శుక్రవారం రావటంతో ఆదివారం 7వ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమై ఆగష్టు 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గోల్కొండ కోటలో ప్రారంభమయ్యే బోనాల వేడుకలు తిరిగి 9వ పూజతో గోల్కొండ కోటలోనే ముగియనున్నాయి.

తొలిబోనం జగదాంబిక అమ్మవారికి….

గోల్కొండ జగదాంబిక అమ్మ అక్కాచెల్లెళ్లైన మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మ అనే మొత్తం ఏడుగురు అక్కాచెళ్లెళ్లకు పండుగలో భాగంగా బోనాలు సమర్పిస్తారు. తొలిబోనం గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి సమర్పించిన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా బోనాల సంబరాలకు అంకురార్పణ జరుగుతుంది. రెండో బోనం బల్కంపేట ఎల్లమ్మకు, మూడో బోనం లష్కర్‌గా పిలిచే సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, నాలుగో బోనం లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవార్లకు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్టత…

వీటితోపాటు తెలంగాణ పల్లెపల్లెల్లో కొలువైన గ్రామ దేవతలకు కూడా వారి వారి సంప్రదాయాల ప్రకారం బోనాలు సమర్పిస్తారు. నగరవ్యాప్తంగా జరిగే బోనాల వేడుకల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్టత ఉంటుంది. ముఖ్యమైనవి గోల్కొండ, లష్కర్, లాల్ దర్వాజ బోనాలు. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారు స్వయంభూ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తుంటారు.

ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు…

తొలిరోజు ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి, అధికారులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. లంగర్ హౌజ్ చౌరస్తా నుంచి ఊరేగింపుగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు తీసుకొని చోటా బజార్‌లోని ఆలయ పూజారి ఇంటికి చేరుకుంటారు. అమ్మవారికి పట్టు బట్టలు సమర్పించి అక్కడ నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకొని బంజారా దర్వాజ వైపుగా గోల్కొండ కోటకు చేరుకుంటారు. బంజారా దర్వాజ నుంచి నజర్గా చెప్పే తొలిబోనంతో అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా గోల్కొండ కోటపైకి చేరుతుంది. అక్కడ అమ్మవారి ఘటాలు ఉంచి 9 వారాలు అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు నిర్వహిస్తారు. గోల్కొండలో ప్రారంభమయ్యే బోనాల వేడుకలు ఆగస్టు 4వ తేదీన చివరి పూజ, తొట్టెలు, ఫలహారం బళ్ల ఊరేగింపుతో గోల్కొండ కోటలో ముగుస్తాయి.

రెండో బోనం బల్కంపేట ఎల్లమ్మకు….

గోల్కొండ తర్వాత రెండో బోనం బల్కంపేట ఎల్లమ్మకు ఎక్కిస్తారు. అయితే ఆషాఢ మాసంలోవచ్చే తొలి మంగళవారం ఎల్లమ్మకు కళ్యాణం నిర్వహించటం ఆనవాయితీ. ఇందులో భాగంగా తొలిరోజు ఎదుర్కోలు, రెండో రోజు కల్యాణం, మూడోరోజు రథోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. భక్తులు ఆదివారం బోనాలు చెల్లిస్తారు. కల్యాణ వేడుకలో ఏటా వేలాది మంది భక్తులు పాల్గొనటమే కాదు అమ్మవారి కళ్యాణం కోసం ప్రత్యేకంగా ఆలయం లోపలే పట్టు చీరలు నేయటం ఇక్కడి విశేషం.

మూడో బోనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి…

మూడోవారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు జరుగనున్నాయి. లష్కర్‌లో 2 రోజుల పాటు సాగే బోనాల వేడుకల్లో తొలిరోజు తెల్లవారు జామునే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం భక్తులు బోనాలను అనుమతిస్తారు. తొలిరోజు బోనాలు ఎక్కించగా రెండో రోజు అమ్మవారికి బలి, రంగం, గావు పట్టడం, ఏనుగు అంబారీ ఊరేగింపులతో ఆద్యంతం ఆకట్టుకుంటాయి. లష్కర్ బోనాల్లో రెండో రోజు వేడుకలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. రాష్ట్రప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూసే రంగం కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది.

భవిష్యవాణి…

అమ్మవారు శరీరంపైకి ఆవహించిన అవివాహిత అయిన పడతి ఆలయంలో మాతకు ఎదురుగా పచ్చికుండపై నిలుచుని రాష్ట్ర ప్రజల భవిష్యత్ పలుకుతుంది. స్వయంగా ఆ ఉజ్జయిని మహంకాళి అమ్మే తమ భవిష్యత్ పలికిందని భక్తులు విశ్వసిస్తారు. రంగం పూర్తయ్యాక అమ్మవారి ఘటాలను ఏనుగు అంబారిపై ఊరేగిస్తారు. సాయంత్రం తల్లికి సమర్పించే ఫలహారపు బండ్లను పురవీధుల్లో ఊరేగిస్తారు.

లష్కర్ తర్వాత లాల్ దర్వాజ బోనాలు

లష్కర్ తర్వాత లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. పాతబస్తీలోని శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల వేడుకలు మొత్తం 11 రోజుల పాటు సాగుతాయి. అందులో ప్రధానఘట్టాలైన బోనాలు, అమ్మవారి ఊరేగింపు ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్నాయి. 19న అమ్మవారికి ధ్వజారోహణ, శిఖర పూజ, కలశ స్థాపన చేయడంతో అంకురార్పణ జరుగుతాయి. అప్పటి నుంచి 9 రోజుల పాటు అమ్మవారికి వివిధ రకాల పూజలు, చేసి 28న బోనాల వేడుకలు నిర్వహిస్తారు. బోనాల రోజు ఉదయం అమ్మవారికి బైండ్లవారు బలిహరణ కార్యక్రమం చేసిన అనంతరం ఆలయ అర్చకులు మహాభిషేకం చేస్తారు. తర్వాత నుంచి భక్తులు బోనాలను సమర్పిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News