హైదరాబాద్: ఓ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చోరీ జరిగిన విషయం సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం…. హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో వారి బంధువులు ఉంటున్నారు. ఇంట్లోని 16తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ.6లక్షల నగదు చోరీకి గురయ్యాయి. ఈ విషయం శుక్రవారం సాయంత్రం వారు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు. ఎసిపి వెంకట్ రెడ్డి, సిఐ రమేష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తరచూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చోరీలు జరుగుతున్నాయి.
అత్యంత పటిష్ట భద్రత ఉన్న ప్రాంతంలోనే చోరీలు జరగడంతో పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చోరీ జరగడంతో పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంటి దొంగలపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్వార్టర్స్‌లో ఉండే వారి బంధువుల వద్ద పనిచేస్తున్న డ్రైవర్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగతనం జరిగినప్పటి నుంచి డ్రైవర్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో మరింత అనుమానం బలపడుతోంది. అంతేకాకుండా పోలీసులు సిసిటివి ఫుటేజ్ పరిశీలించడంతో బయటి వ్యక్తులు ఎవరూ లోపలికి వచ్చినట్లు లేకపోవడంతో డ్రైవర్ పనేనని భావిస్తున్నారు.
Gold and Cash stolen in Hyderguda old MLA Quarters