Monday, December 23, 2024

సెక్రటేరియట్‌కు గ్రీన్ బిల్డింగ్ ఇండియా కౌన్సిల్ నుంచి గోల్డ్ సర్టిఫికెట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్‌కు గ్రీన్ బిల్డింగ్ ఇండియా కౌన్సిల్ గోల్డ్ రేటెడ్ సర్టిఫికెట్ దక్కింది. పర్యావరణహితంగా గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు పాటించినందుకు ఈ సర్టిఫికెట్ వచ్చింది. భారత్‌లో గోల్డ్ రేటెడ్ సర్టిఫికెట్ పొందిన తొలి సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్‌గా ఈ ఘనత సాధించింది. ఈ మేరకు సోమవారం సెక్రటేరియట్‌లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ శేఖర్ రెడ్డి రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఈ అవార్డును అందించారు. సచివాలయానికి సర్టిఫికెట్ రావడంపై మంత్రి వేముల హర్షం వ్యక్తం చేశారు.

సిఎం ఆలోచనలకు అనుగుణంగానే సెక్రటేరియట్ నిర్మాణం
అత్యంత విశాలంగా, అధునాతన హంగులతో సెక్రటేరియట్‌ను పర్యావరణహితంగా నిర్మించామని మంత్రి తెలిపారు.
ప్రకృతి ప్రేమికుడైన సిఎం కెసిఆర్ చొరవ వల్లే ఈ అవార్డు సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో ఇప్పటికే గ్రీనరీ 7.7శాతం పెరిగిందన్నారు. సిఎం ఆలోచనలకు అనుగుణంగానే సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో సోలార్ విద్యుత్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, ప్లాటినం అవార్డును సైతం గెలుచుకుంటామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్‌గా తెలంగాణ సెక్రటేరియట్ గుర్తింపు పొందడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ఈఎన్సీ గణపతిరెడ్డి బృందానికి ఆయన అభినందనలు తెలిపారు.

గోల్డ్ రేటింగ్ ఎలా ఇస్తారంటే..

భవనాల నిర్మాణంలో హరిత ప్రమాణాలను పాటించినట్లు ఆయా సంస్థలు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అవి ఎలా ప్రమాణాలను పాటించాయో లేదో గుర్తించేందుకు ఎంపిక చేసిన నిపుణులతో ఒక కౌన్సిల్ ఉంటుంది. ఆ నిపుణుల బృందం నిర్మాణాన్ని పరిశీలించి నిర్మాణ తీరు తెన్నులు తెలుసుకుంటుంది. ఐజీబిసి ప్రమాణాల మేరకు నిర్మాణం జరిగినట్లు తేలితే అప్పుడు గోల్డ్ రేటింగ్ ప్రకటిస్తుంది.

గోల్డ్ రేటింగ్ రావాలంటే..
భవనాలకు గోల్డ్ రేటింగ్ దక్కాలంటే నిర్మాణంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ముఖ్యంగా ఆ భవనంలోకి సహజ సిద్ధమైన గాలి, వెలుతురు పుష్కలంగా వచ్చేలా నిర్మణ శైలి ఉండాలి. నీటి వృథాను నియంత్రించేందుకు సెన్సార్స్, ఆటోమేటిక్ విద్యుత్ పరికరాలను ఉపయోగించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News