టొరంటో: కెనడాలోని టొరంటో అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం ఉన్న కంటైనర్ మాయమైంది. ఏప్రిల్ 17న జరిగిన ఈ భారీ చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 20మిలియన్ కెనడా డాలర్ల విలువైన బంగారం, ఇతర ఖరీదైన వస్తువులు చోరీకి గురైనట్లు కెనడా పోలీసులు తెలిపారు. విలేఖరుల సమావేశంలో గురువారం పోలీస్ ఇన్‌స్పెక్టర్ స్టీఫెన్ మాట్లాడుతూ అన్నివిధాలుగా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విమాన ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు.
ఇది ప్రజాభద్రతకు సంబంధించిన విషయం కాదని ఇన్‌స్పెక్టర్ స్టీఫెన్ అన్నారు. చోరీకి గురైన బంగారం, ఇతర వస్తువుల విలువ సుమారు 20మిలియన్ కెనడా డాలర్లుకుపైగా ఉంటుందని, అమెరికా డాలర్లలో దీని విలువ 14.8మిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. బంగారంతోపాటు ఇతర వస్తువులు ఉన్న ఐదు అడుగుల పొడవు, వెడల్పు ఉన్న కంటైనర్ చోరీకి గురైందని వెల్లడించారు. చోరీచేసినవారిని పట్టుకోవడమే తమ లక్షమన్నారు. అయితే బంగారం ఉన్న కంటైనర్ ఎక్కడ నుంచి వచ్చింది. ఎక్కడికి చేరాల్సిఉంది తదితర వివరాలు చెప్పేందుకు నిరాకరించారు.