మోనా అగర్వాల్‌కు కాంస్యం
పారాలింపిక్స్‌లో భారత్ జోరు
పారిస్: పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ పతకాల బోణీ కొట్టింది. క్రీడల రెండో రోజు శుక్రవారం భారత్ షూటింగ్ విభాగంలో రెండు పతకాలను సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1లో అవనీ లేఖరా స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన మోనా అగర్వాల్ కాంస్య పతకం సొంతం చేసుకుంది.టోక్యో పారాలింపిక్స్‌లో పసిడితో మెరిసిన 22 ఏళ్ల రాజస్థాన్ అమ్మాయి అవని ఈసారి అసాధారణ ఆటతో బంగారు పతకం కైవసం చేసుకుంది. ఆరంభం నుంచే అవని అత్యం త నిలకడైన ప్రదర్శనను కనబరిచింది. ఒత్తిడి దరిచేరకుండా చూసుకుంటూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో అవని 249.7 పాయింట్లు సాధించి స్వర్ణం దక్కించుకుంది. ఇక ఇదే విభాగంలో మరో భారత షూటర్ మోనా అగర్వాల్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది.
వైకల్యాన్ని అధిగమించి..
కాగా, 11 ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురికావడంతో అవని రెండు కాళ్లు చచ్చుబడిపోయారు. దీంతో కొన్నేళ్ల వరకు అవని చదువుకే పరిమితమైంది. కానీ 2015 ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. వేసవి సెలవుల్లో మొదట ఆర్చరీని నేర్చుకున్న అవని.. ఆ తర్వాత షూటింగ్‌కు మళ్లింది. అప్పటి నుంచి మళ్లీ వెనుదిరిగి చూడలేదు. అద్భుత ప్రతిభతో వరుసగా రెండు సార్లు ఒలింపిక్ స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది.