ఐఎంఓలో 3 స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారతీయుడు ప్రంజల్ శ్రీవాస్తవ
న్యూఢిల్లీ: ఈనెల 11, 12 తేదీలలో ఓస్లోలో జరిగిన ఇంటర్నేషనల్ మేథమ్యాటికల్ ఒలంపియాడ్(ఐఎంఓ)లో భారతీయ విద్యార్ధి అద్భుతమైన ప్రతిభను చాటాడు. బెంగళూరుకు చెందిన 18 సంవత్సరాల ప్రంజల్ శ్రీవాస్తవ ఐఎంఓలో మూడు బంగారు పతకాలు సాధించిన తొలి భారతీయునిగా చరిత్రలో నిలిచారు. 63 సంవత్సరాల ఐఎంఓ చరిత్రలో శ్రీవాస్తవ కన్నా ఎక్కువ పతకాలు సాధించింది 11 మంది మాత్రమే కావడం విశేషం. 2019లో మొదటిసారి 35 స్కోరుతో బంగారు పతకాన్ని గెలుచుకున్న ప్రంజల్ శ్రీవాస్తవ 2021లో 31 స్కోరుతో రెండవసారి బంగారు పతకాన్ని సాధించారు. ఈ ఏడాది మూడోసారి 34 స్కోరుతో స్వర్ణ పతకాన్ని ఆయన గెలుచుకున్నారు. శ్రీవాస్తవ తల్లిదండ్రులు ఇద్దరూ బెంగళూరులో ఐటి ప్రొఫెషనల్స్. తన తండ్రి తనకు చిన్నప్పటి నుంచి ఆసక్తికరమైన కథలు చెప్పేవారని, తన తల్లి, తాతగారు గణిత శాస్త్రంలోని మెళకువలను నేర్పించేవారని శ్రీవాస్తవ తెలిపారు.