ముంబయి : పండగ సీజన్‌తో పాటుగా అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో పసిడి ధరలకు రెక్క లు వచ్చాయి. పండగల సందర్భంగా ఉద్యోగులకు బోనస్‌లు, పండగ అడ్వాన్సుల రూపంలో అదనపు సొమ్ములు రావడంతో ఎక్కువ మంది ఏదైనా కొత్త వస్తువు కొనుగోలుకు మొగ్గు చూపు తూ ఉంటారు. అయితే చాలామంది బంగారు అభరణాల కొనుగోలుకే తొలి ఓటు వేస్తుంటారు. ఫలితంగా దసరా మొదలుకొని దీపావళి దాకా బంగారు దుకాణాలు కస్టమర్లతో కళకళలాడుతూ ఉంటాయి. కానీ ఈ సారి కొనుగోలుదారులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. గత పది రోజుల్లో పసిడి ధరలు దాదాపు 3 వేల రూపాయల దాకా పెరిగాయి. ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌లో తులం (24 క్యారెట్ల )బంగారంధర రూ.58,910 పలికితే శనివారం( 21వ తేదీ) నాటికి అది రూ.61,750 కి చేరుకుంది.
అంటే పది రోజుల వ్యవధిలో రూ.2,840 పెరిగింది. మిగతా నగరాల్లో కూడా ఇదే తీరు ఉంది. మరో వైపు వెండి ధరలు కూడా బాగానే పెరిగా యి. ఈనెల 12న వెండి కిలో ధర రూ.75,500 పలికితే శనివారం నాటికి అది రూ.78,800కు చేరుకుంది. అంటేరూ.3,200 పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగడమే మన దేశంలో వీటి ధరలు పెరగడానికి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ బాండ్ల విలువ పడిపోవడంతో పాటుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీరేట్లను పెంచక తప్పదని యుఎస్ ఫెడ్ రిజర్వ్ ప్రకటించడంతో డాలరు బలహీనపడింది.ఫలితంగా ఇన్వెస్టర్లకు బంగారం ప్రత్యామ్నాయంగా మారింది. మరో వైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారఃగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం కూడా బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణమయింది. ఇదే ధోరణి కొనసాగిన పక్షంలో ధన్‌తేరస్, దీపావళి నాటికి బంగారం ధర పది గ్రాముల ధర రూ.62 వేలను దాటేయవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.