9 నెలల గరిష్ఠానికి చేరిన రేటు
వచ్చే రెండు, మూడు నెలల్లో 52 వేలు దాటొచ్చు
రష్యాఉక్రెయిన్ ఉద్రిక్తతతో పసిడికి డిమాండ్: నిపుణులు
న్యూఢిల్లీ : మళ్లీ బంగారం, వెండి ధరలు పెరుగుదల బాట పట్టాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత కారణంగా విలువైన లోహాలకు డిమాండ్ పెరిగింది. మంగళవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.50,460 (24 క్యారెట్)కు పెరగ్గా, సోమవారం ఇది రూ.50,050గా ఉంది. అంటే ఒక్క రోజులోనే రూ.410 పెరిగంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇదే విధంగా రేటు పెరిగింది. ఇక వెండి ధర ఒక్క రోజులో రూ.400 పెరగ్గా, కిలో ధర రూ.64,400కు చేరింది. మొత్తానికి పది గ్రాముల పసిడి ధర మళ్లీ రూ.51 వేలకు చేరగా, మరోవైపు వెండి కిలో ధర కూడా రూ.65 వేలకు చేరువ అవుతోంది.
పెరుగుతున్న డిమాండ్
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత పెరగడంతో, బంగారం, వెండికి డిమాండ్ పెరగడంతో మంగళవారం బంగారం ధర 9 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. బులియన్ మార్కెట్ ప్రకారం, గత ఏడాది కాలంలో పసిడి రేటు ధర 8 శాతం పెరిగింది. ఏడాది క్రితం బంగారం అంటే 2021 ఫిబ్రవరి 22న పసిడి ధర రూ. 46,649 ఉండగా, ఇప్పుడు రూ. 50,547కి చేరింది. అంటే సంవత్సరం కాలంలో బంగారం ధర రూ.3,898 పెరిగింది. ఈ నెలలో బంగారంలో మంచి ర్యాలీ కనపిస్తోంది. అయితే కేవలం 22 రోజుల్లోనే పసిడి రూ.2,571 ఖరీదైనదిగా మారింది. ఫిబ్రవరి 1న 10 గ్రాములు రూ.47,976 ఉండగా, ప్రస్తుతం రూ.50,547కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ 1,909.12 డాలర్లకు చేరుకుంది. మరోవైపు వెండి విషయానికి వస్తే ఔన్స్ ధర 24 డాలర్లు దాటింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు సాధారణంగా బంగారంలో పెట్ట్టుబడి డిమాండ్ పెరుగుతుంది.
రెండు మూడు నెలల్లో 52 వేలకు
ద్రవ్యోల్బణం అదుపులో లేనందున బంగారం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రాబోయే మూడు-నాలుగు నెలల్లో 2000 డాలర్ల స్థాయికి చేరుకోనుంది. భారత్‌లో బంగారం 52 వేలు దాటనుంది. గ్లోబల్ టెన్షన్ పెరిగిందని. ఇది బంగారానికి మద్దతునిస్తుందని, ఈ సంవత్సరం 10 గ్రాముల పసిడి రూ.55 వేల వరకు వెళ్లే అవకాశముందని కేడియా కమోడిటీ డైరెక్టర్ అజయ్ కేడియా అభిప్రాయం వ్యక్తం చేశారు. వెండి కూడా ఈ సంవత్సరం కిలో 80 నుండి 85 వేల రూపాయల స్థాయికి చేరవచ్చని అన్నారు.