న్యూఢిల్లీ : బంగారం ధర మరింత పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి (24 క్యారెట్) ధర రూ.800 పెరిగి రూ.65,000కు చేరుకుంది. క్రితం రోజు ఇది రూ.64,200 వద్ద ఉంది. గుడ్ రిటర్న్ వెబ్‌సైట్ ప్రకారం, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా నగరాల్లో బంగారం ధరలు చూస్తే గణనీయంగా పెరిగాయి. మంగళవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ పసిడి 10 గ్రాములు ధర రూ.760 పెరిగి రూ.64,850కి చేరుకుంది. ముంబై, కోల్‌కతా నగరాల్లోనూ వరుసగా రూ.760 పెరిగి రూ.64,850, 64,850కి చేరుకుంది.
చెన్నైలో మాత్రం రూ.930 పెరిగి రూ.65,620 కి చేరుకుంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ( ఐబిజెఎ) వెబ్‌సైట్ ప్రకారం, 10 గ్రాముల బంగారం ధర రూ.924 పెరిగి రూ.64,404కి చేరుకుంది. అంతకుముందు డిసెంబర్ 4న బంగారం ఆల్ టైమ్ హైకి చేరుకుంది. అప్పుడు దాని ధర 10 గ్రాములు రూ.63,805గా ఉంది. అదే సమయంలో వెండి ధర రూ.1,261 పెరిగి కిలో రూ.72,038కి చేరింది. అంతకుముందు రూ.70,777గా ఉంది. బంగారం పెరుగుదలకు కారణాలను చూస్తే, 2024లో ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఏర్పడుతుందనే భయం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్, డాలర్ ఇండెక్స్ బలహీనపడడం, ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం వంటివి ఉన్నాయి.