6 నెలల్లో 25 శాతం పెరిగిన రేటు
రూ.57 వేల నుండి రూ.70 వేలు దాటిన వైనం
ఈ సంవత్సరం రూ.72 వేలు దాటొచ్చంటున్న నిపుణులు
ముంబై : సాధారణంగా బంగారం, ఈక్విటీ మార్కెట్ రాబడులు వ్యతిరేక దిశలో కనపిస్తాయి. ఈక్విటీ మార్కెట్లు మంచి సానుకూల రాబడిని ఇస్తే, మరోవైపు బంగారం ధరలు స్తబ్దుగా ఉంటాయి. అయితే ప్రస్తుతం స్టాక్‌మార్కెట్, బంగారం ధరలు రెండూ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పసిడి ధర పెరుగుదల భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అమెరికాలో బంగారం ధర ఔన్స్ 2,250 డాలర్లతో ఆల్‌టైమ్ హైకి చేరుకుంది. 2022లో కనిష్ట స్థాయి నుంచి ఇప్పుడు బంగారం ధర 38 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లోనే 25 శాతం పెరిగింది. కొత్త ఆర్థిక సంవత్సరం (202425) ప్రారంభమైన తర్వాత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బంగారం ధర (10 గ్రాములు) రూ.70 దాటింది.
ఈ విలువైన లోహం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపుపై అనిశ్చితి నేపథ్యంలో డాలర్ బలహీన పడగా, ఈ కారణంగా బంగారం ధర పెరుగుతోంది. గత 6 నెలల్లో బంగారం ఇప్పటికే దాదాపు 25 శాతం రాబడిని ఇచ్చింది. గత 6 నెలల్లోనే రూ.57 వేల నుంచి రూ.70 వేలకు చేరింది. ఈ ఏడాది అంటే కేవలం మూడు నెలల్లో కూడా 10 శాతానికి పైగా పెరిగింది. ఈ ట్రెండ్ ఇంకా కొనసాగవచ్చు. 2024 చివరి నాటికి బంగారం ధర రూ.72,000కు చేరుకోవచ్చని ఎస్‌ఎస్ వెల్త్ స్ట్రీట్ వ్యవస్థాపకురాలు సుగంధ సచ్‌దేవా అభిప్రాయపడ్డారు. అంటే ఈ సంవత్సరం బంగారం మరో రూ.2 వేలకు పైగా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి, బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.
ద్రవ్యోల్బణం పెరిగితే..
రికార్డు స్థాయికి చేరుకున్నప్పటికీ బంగారం ధర తగ్గే అవకాశాలు లేవని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనూజ్ గుప్తా అన్నారు. బంగారం డిమాండ్ పెరుగుతోంది. గత 20 ఏళ్లుగా బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరిగితే బంగారం ధరలు మరింత పెరుగుతాయని కమోడిటీ నిపుణులు అంటున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలు బంగారంపై కూడా ప్రభావం చూపుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. సచ్‌దేవా ప్రకారం, 2025 వరకు బంగారం ధరలు పెరుగుతూనే ఉండే పరిస్థితి ఉంది.
2023లో బంగారం ధర రూ.8 వేలకు పైగా పెరిగింది. 2023 ప్రారంభంలో బంగారం 10 గ్రాములు రూ. 54,867 వద్ద ఉంది, ఇది డిసెంబర్ 31 నాటికి రూ. 63,246కి చేరుకుంది. అంటే 2023 సంవత్సరంలో రూ. 8,379 (16%) పెరిగింది. అదే సమయంలో వెండి కూడా కిలో రూ.68,092 నుంచి రూ.73,395కి పెరిగింది. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పంటలు నాశనమయ్యే అవకాశం ఉంది. దీని కారణంగా ద్రవ్యోల్బణం తగ్గింపు ధోరణి ఉండే అవకాశం లేదు, బంగారం పరుగు తీయవచ్చు. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారం ఖరీదైనదిగా మారుతుంది.
సంవత్సరం సగటు బంగారం ధర (10 గ్రా.)
1980 రూ. 1,800
1990 రూ. 3,200
2000 రూ. 4,500
2010 రూ. 18,500
2011 రూ. 26,000
2012 రూ. 31,500
2013 రూ. 29,000
2014 రూ. 27,500
2015 రూ. 26,000
2016 రూ. 28,500
2017 రూ. 29,500
2018 రూ. 31,000
2019 రూ. 35,000
2020 రూ. 49,500
2021 రూ. 52,000
2022 రూ. 48,500
2023 రూ. 64,500