Sunday, December 22, 2024

కొండెక్కిన బంగారం ధర

- Advertisement -
- Advertisement -

10 గ్రాములు రూ 75,000 దాటి చుక్కలదిక్కే
ఇక వెండి కిలో రూ 85,000 దాటి దూకుడు
ప్రపంచ భౌగోళిక రాజకీయాలే కీలక కారణం
అత్యధిక నిల్వలతో గోల్డ్‌కింగ్‌గా చైనా సత్తా

న్యూఢిల్లీ : దేశంలో పర్వదినాలు పెళ్లిళ్ల వేళలో బంగారం ధరలు కొండెక్కి , దిగిరాను అనే ధోరణితో అలకవహించాయి. ఇప్పుడు బంగారంతో పాటు వెండి ధరలు కూడా విపరీత స్థాయికి చేరాయి. బంగారం ధర దేశంలో ఇప్పుడు 10 గ్రాముల లెక్కన చూస్తే రూ 75,000 దాటింది. రోజుకు రెండు మూడు వేలు ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఇప్పుడు ఇంతకు ముందెన్నడూ లేనంత స్థాయికి చేరాయి. ఈ ఏడాది జనవరి మొదట్లో బంగారం ధర 10 గ్రాములకు రూ 62000 వరకూ పలికింది. క్రమేపీ పెరిగింది.

దీనితో వివాహాలకు బంగారం నగలు చుట్టపు చూపులు అయ్యాయి. వెండి ధర ఇప్పుడు కిలోకు రూ 85000కు చేరింది. ధరల విషయంలో ఇప్పుడు వెండి జగమొండి అయింది. అంతర్జాతీయ స్థాయి పరిణామాలు , ప్రత్యేకించి చైనా, రష్యా అమెరికా ఇతర దేశాల నడుమ అంతర్జాతీయ స్థాయి వాణిజ్య పోరు తీవ్రస్థాయికి చేరడంతో బంగారం ధరలు ఇప్పుడు ఆకాశానికి చేరాయి. ఈ కీలక లోహాలకు పలు దేశాలు పెద్ద ఎత్తున ఏకంగా వందల టన్నుల్లో కొనుగోళ్ల రూపంలో పెట్టుబడులకు దిగడంతో దీని ప్రభావం చిల్లరగా మార్కెట్‌లో ధరల పెరుగుదలకు దారితీసిందని ఆర్థిక , గోల్డ్ వ్యాపార ప్రముఖులు విశ్లేషించారు.

బంగారం కొనుగోళ్లలో చైనా అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలి కొద్ది నెలల్లోనే చైనా పలు కారణాలతో 200 టన్నులకు పైగా బంగారం కొనుగోలు చేసింది. దీనితో చైనా వద్ద ఇప్పుడు 2200 టన్నుల వరకూ బంగారం నిల్వలు ఉన్నాయని వెల్లడైంది. అమెరికా, యూరప్ దేశాల నుంచి ఆంక్షలు , విదేశీ మారకద్రవ్య నిల్వల సమస్య లేకుండా చూసుకునేందుకు చైనా భారీ స్థాయిలోనే గోల్డ్ కింగ్ అయి కూర్చుంది.

ఈ క్రమంలోనే భారతదేశం కూడా ఇటీవల 13 టన్నుల మేర బంగారం కొనడంతో , ఇప్పుడు దేశంలో బంగారం నిల్వలు 800 టన్నులను దాటాయి. పలు ప్రాంతాలలో యుద్ధ మేఘాల భయాలు, ఆంక్షల వాతావరణం నెలకొనడంతో భారీ స్థాయిలో దేశాలే టోకున బంగారం నిల్వలను పెంచుకుంటూ పోవడం, విలువలు పడిపోతున్న కరెన్సీ కంటే బంగారం చాలా విలువైనదనే అభిప్రాయం వ్యాపారవర్గాలలో నెలకొనడంతో జనవరి నుంచే భారీ స్థాయిలో బంగారం కొనుక్కోవడం తంతుగా మారింది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ వచ్చే సరికి బంగారం మరింత సింగారం అయి కూర్చుంది. అంతర్జాతీయంగా చూస్తే ఈ ఏడాది ఆరంభం నుంచి బంగారం ధరలు ఏకంగా ఇప్పటివరకూ 16 శాతం వరకూ పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News