Monday, December 23, 2024

తెలంగాణలో దివ్యాంగులకు స్వర్ణయుగం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి

 నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు స్వర్ణయుగమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అభివర్ణించారు. దివ్యాంగులకు 3016 రూపాయల నుంచి 4016 రూపాయలకు పెన్షన్ పెంచిన సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగులకు గురువారం నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొసిడింగ్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రహ్మరాసిన నుదిటిరాతనే తిరగరాసిన అభినవ బ్రహ్మ కెసిఆర్ అని అన్నారు.

అంగవైకల్యం ఒక లోపం మాత్రమేనని, ముందుకు పోకుండా అడ్డుకునే శాపం కాదని, లక్షాన్ని సాధించడంలో వైకల్యం అడ్డురాదని నిరూపించినవారు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారన్నారు. దివ్యాంగుల పెన్షన్ రూ. 4016కు పెంచిన కెసిఆర్‌ది చల్లని మనసన్నారు. దివ్యాంగుల అవసరాలు తెలుసుకుని వారికి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల 40 వేల మంది దివ్యాంగులకు నెలకు రూ. 3 వేల16 ద్వారా నెలకు 180 కోట్ల చొప్పున, ఏడాదికి 2160 కోట్లు ఇస్తున్నారన్నారు.

ఒక్క పెన్షనే కాకుండా వికలాంగుల సహకార సంస్థ ద్వారా అనేక సహకార ఉపకరణాలు ఉచితంగా అందిస్తున్నారని అన్నారు. దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్స్‌లో 5శాతం రిజర్వేషన్‌లు, విద్య, ఉపాధి పథకాల్లో 5శాతం రిజర్వేషన్లు, ఉద్యోగ నియామకాల్లో 4శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు. బ్యాటరీ ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ అవయవాలు మొత్తం 14 రకాల వస్తువులను దివ్యాంగులకు అందిస్తున్నారని ఆయన వివరించారు.

కాగా దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తం పెన్షన్‌లు ఇస్తున్న దాఖలాలు లేవని, దేశ ప్రధాని నరేంద్ర మోడి సొంత రాష్ట్రంలో కూడా దివ్యాంగులకు ఇచ్చేది కేవలం రూ. వెయ్యి మాత్రమేనని, బిజెపి పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్రలో 300, మధ్యప్రదేశ్‌లో 300, ఉత్తరాఖాండ్‌లో 1000, ఉత్తరప్రదేశ్‌లో 1000, మణిపూర్‌లో 1500, త్రిపురలో 700, మమత బెనర్జీ ఏలుతున్న పశ్చిమ బెంగాల్‌లో 700 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 4016 రూపాయలు ఇస్తున్నారన్నారు.

పెన్షన్ల పెంపు మాత్రమే కాదు అన్ని సంక్షేమ పథకాలలో దివ్యాంగులకు పెద్దపీట వేస్తామని, సిఎం కెసిఆర్ పాలనలో సంక్షేమ రంగం ఒక స్వర్ణయుగంలా మారిందని అన్నారు. నాటి సంక్షోభానికి పాతరేసి నేడు సంక్షేమ జాతర సాగుతుందని, రైతు బంధు, రైతు భీమా, కళ్యాణలక్ష్మి, మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా, నియోజకవర్గంలో వేల మంది వికలాంగులకు రూ. 4016రూ, వృద్ధులకు 2016 రూపాయల పెన్షన్, ఉచిత ఆవాసాలు, కెసిఆర్ కిట్టు వంటి 450 పథకాలు అమలు చేస్తున్నామని, కాంగ్రెస్, బిజెపి నేతలు కల్లుండి చూడలేని కబోదులని, వారు దివ్యాంగులను ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు. అసలు వికలాంగులు మీరు కాదు, అన్ని ఉండి ఇతరుల కోసం ఏమి చేయడానికి ముందుకు రానివారు మానసిక వికలాంగులని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఓర్వలేక విషయం కక్కుతున్న కాంగ్రెస్, బిజెపి నాయకులే రాజకీయ వికలాంగులు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎంజెఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లెర్నింగ్ లైసెన్స్ అందజేత

అనంతరం జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్‌లో ఇటీవల ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ శిబిరంలో భాగంగా గురువారం ఎంజెఆర్ ట్రస్ట్ అధినేత, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి వెయ్యి మందికి లెర్నింగ్ లైసెన్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్, పలువురు పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News