- ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న రాష్ట్రం
- అన్నిరంగాల్లోనూ మనమే దేశానికి ఆదర్శం
- దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం
- జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సుపరిపాలన దినోత్సవం
ఆదిభట్ల: తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగం దిశగా అడుగులు వేస్తోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శమై నిలుస్తోందని ఆమె ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లోని జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి సబిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిఎం కెసిఆర్ సారథ్యంలో రాష్ట్రం స్వర్గయుగం వైపు అడుగులు వేస్తోందని అన్నారు. సంక్షేమ పథకాలు, సంస్కరణల అమలుతో యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. సంక్షేమ ఫలాలను ప్రతి గడపకూ చేరువ చేయడమే లక్షంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. దశాబ్ద కాలంలో వ్యవసాయరంగం మొదలుకొని ఐటి వరకూ ప్రతి రంగంలోనూ సమగ్రమైన మార్పులు తీసుకువచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదని ఆమె అన్నారు.
ప్రజలకు ప్రభుత్వసేవలను చేరువచేసేందుకు నూతన జిల్లాల ఏర్పాటుతోపాటు కలెక్టర్ కార్యాలయాలను నిర్మించిన ఘనత తెలంగాణకు దక్కిందని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం అన్ని శాఖలను కలెక్టర్ కార్యాలయాల్లోనే అందుబాటులోకి తెచ్చినట్లు ఆమె తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పెన్షన్, కెజి టు పిజి తదితర పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. అలాగే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకాలు రాష్ట్రానికి వన్నెతెచ్చాయని అన్నారు. భవిష్యత్తులోనూ తెలంగాణ రాష్ట్రం మరింత ఆదర్శవంతం కానుందని ఆమె అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆమె శుభకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీశ్, జడ్పి చైర్‌పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గుర్కా జైపాల్‌యాదవ్, అదనపు కలెక్టర్లు ప్రతీక్‌జైన్, తిరుపతిరావు, డిఆర్‌వో హరిప్రియ, ఆర్డీవో వెంకటాచారి, డిసిపి శ్రీనివాస్‌తోపాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.