సిటీ బ్యూరో ః భక్తులు కోరిన కోరికలను తీర్చే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి బంగారు అభరణాల్లో బంగారు కిరీటం కూడా చేరనుంది. అమ్మవారికి భక్తులు మొక్కు రూపంలో సమర్పించుకున్న బంగారంలో కిరిటం చేయించనున్నట్లు గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బల్కంపేట ఆలయం వద్ద నిర్మించిన షాపులను గురువారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ దాతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తులు సమర్పించిన బంగారం , వెండిని అమ్మవారి కోసం వినియోగించనున్నట్లు చెప్పారు. 2 కిలోల 200 గ్రాముల బంగారం తో అమ్మవారికి కిరీటం, పాదాలు, చేతులు తదితర ఆభరణాలతో పాటు ఆలయ ప్రధాన ద్వారం తలుపులకు వెండి తాపడంచేయించనున్నట్లు తెలిపారు.
చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. అమ్మవారి కళ్యాణాన్ని వచ్చే నెల 20 వ తేదీన అత్యంత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఆలయం వద్ద కొబ్బరికాయలు, పూలు, ఇతర పూజా సామాగ్రి అమ్ముకొనే చిరు వ్యాపారుల కోసం దాతల సహకారంతో రూ.32 లక్షల వ్యయంతో 34 షాపులను నిర్మించి ఎలాంటి అద్దె లేకుండా కేటాయించినట్లు చెప్పారు. ఇవే కాకుండా ఆలయంలో ప్రసాదాల తయారీ కోసం మోడరన్ కిచెన్ నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అ
మ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వాహనాల పార్కింగ్ కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మల్టి లెవెల్ పార్కింగ్ నిర్మాణం చేపట్టామని ,దీనిని 5 నెలల్లో పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దాతలు సుబ్బరాజు, సుబ్బారావు, దేవాదాయ శాఖ రీజనల్ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్, కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, EO అన్నపూర్ణ, ప్రవీణ్ రెడ్డి, కిరణ్ తదితర దాతలతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.