Thursday, January 23, 2025

కెసిఆర్ పాలనలో గిరిజన సంక్షేమానికి స్వర్ణయుగం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో గిరిజన సంక్షేమానికి స్వర్ణయుగమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గురుకులాలకు ఇచ్చిన ప్రాధాన్యత వల్లే తమ భవిష్యత్తు మారిందని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గిరిజన ఉత్సవాల సందర్భంగా శనివారం హైదరాబాద్ రాజేంద్రనగర్ గిరిజన సంక్షేమ ఐఐటి స్టడీస్ సెంటర్ లో ఇటీవల ఐఐటి,ఎన్‌ఐటి, నీట్ లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులు మాట్లాడారు. ప్రైవేటుకు దీటుగా గురుకులాల్లో విద్య అందుతున్నదని విద్యార్థులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడంతో ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో సీట్లు ధిస్తున్నామన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మంత్రి సత్యవతి రాథోడ్ సర్టిఫికెట్లు,న ల్యాప్‌టాప్ లను అందజేశారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజనోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు గిరిజనులందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజన గురుకులాలను మరింత బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో 91 గిరిజన గురుకులు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చాక 9 ఏళ్ళలో మరో 94 ఏర్పాటు చేసుకున్నామన్నారు. తెలివితేటలు ఏ ఒక్కరికి సొంతం కాదని ,అవకాశం ఇస్తే అందిపుచ్చుకొని అందరితో పోటీ పడుతూ ఆకాశమే హద్దుగా నేడు గిరిజన విద్యార్థులు దూసుకుపోతున్నారని మంత్రి చెప్పారు. విద్యార్థుల చదువులు 10 తరగతితోనే ఆగిపోకుండా ఇంటర్ వరకు గురుకులాలను అప్‌డేట్ చేసుకున్నామన్నారు. ఒకే రోజు 22 డిగ్రీ కాలేజీలకు మంజూరు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన గురుకులాల్లో లాకోర్సు, ఫైన్ ఆర్ట్, సైనిక్ పాఠశాలను ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారన్నారు. తెలంగాణ విద్యార్థులకు మంచి విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం పెట్టాలని, భావి తరాలు ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.

విద్యార్థులపై పెట్టే ఖర్చును భావితరం బాగుకోసం పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తుందని మంత్రి సత్యవతి రతోడ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్దుల సంక్షేమానికి అధిక ప్రాదాన్యతనిస్తోందని పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో తెచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయనడా నికి విద్యార్థులు సాధించిన ర్యాంకులే నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యార్థుల వలసలు పెరుగుతున్నాయని తెలిపారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందని మంత్రి చెప్పారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వెనుకబడిన వర్గాల పిల్లలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించే విధంగా వృత్తి విద్యా కోర్సులను ప్రవేశ పెట్టారని తెలిపారు. నేడు మన విద్యార్థులు ఐఐటీలు,ఎన్‌ఐటీలు,త్రిబుల్ ఐటీలు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో, ఇంజనీరింగ్ కళాశాలల్లో, ఎంబిబిఎస్, సెంట్రల్ యూనివర్సిటీలలో సీట్లు సాధిస్తున్నారన్నారు. గురుకులాల్లో సీటు వస్తే తమ బిడ్డలు ఇంజనీర్లుగా డాక్టర్లుగా బయటకు వస్తారనే ధీమాతో తల్లిదండ్రులను ఉన్నారని తెలిపారు. తెలంగాణలోని ఏడు యూనివర్సిటీల్లో గిరిజన విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ నిర్మాణం కోసం 140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. నూతనంగా నాలుగు పివిటిజిఎస్ అందుబాటులోకి వస్తున్నాయని వాటిలో వరంగల్, పరిగిలో ఒక్కొక్కటి హయత్ నగర్ లో రెండు అందుబాటులోకి వస్తున్నాయన్నారు.

త్వరలో డైట్ చార్జీలు పెంచుకోబోతున్నామని మంత్రి చెప్పారు. గిరిజనుల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో 3,146 తండాలను గ్రామపంచాయతీలుగా చేయడంతో పాటు, 2 వెల కోట్లతో గిరిజన ఆవాసాలకు రోడ్లను, నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు, 10 శాతం గిరిజన రిజర్వేషన్ అమలు చేసి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన గురుకులాల కార్యదర్శి రొనాల్డ్ రోస్, అదనపు కార్యదర్శి సర్వేశ్వర్‌రెడ్డి, ఉప కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఓ ఎస్ డి రంగారెడ్డి, ప్రిన్సిపల్ సురేందర్, ఆర్ సి ఓ కళ్యాణి, ఐఎఎస్ స్టడీ సర్కిల్ ప్రిన్సిపల్ శారద, తదితరులు పాల్గొన్నారు.

Rathod 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News