త్వరలో మంత్రివర్గ ఉపసంఘం నివేదిక మంత్రితలసాని
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అనాధపిల్లలకు బంగారు భవిష్యత్‌ను అందించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం తన నియోజకవర్గం పరిధిలోని అంబర్ పేట, నింబొలి అడ్డా తదితర ప్రాంతాల్లో పర్యటించి అనాధ బాలికల ఆశ్రమాన్ని సందర్శించారు. వసతి గృహంలోని గదులు , తరగతి గదులు పరిశీలించారు. పిల్లలకు ఉదయం బ్రేక్‌పాస్ట్ , మధ్యాహ్నం భోజనం , సాయంత్రం స్నాక్స్ సక్రమంగా అందిస్తున్నదీలేనిది పిల్లలను అడిగి తెలుసుకున్నారు. బాలికలకు అందిస్తున్న వసతులు, ఇతర సౌకర్యాలను రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ మంత్రి తలసానికి వివరించారు.
అనంతరం మంత్రి ఎమ్మెల్యే కె. వెంకటేశ్ ,డైరెక్టర్ శైలజతోపాటు బాలికలతో కలిసి భోజనం చేశారు. బాలికలకోసం అమలు చేస్తున్న మెనూ పట్ల మంత్రి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అనాధ పిల్లలకు, కరోనా మహమ్మారితో తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలిచి వారిని ఆదుకోవాలనేది ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయం అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో అనాధ పిల్లలకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు కల్పించడానికి అవరమమైన అధ్యయనం కోసం ప్రభుత్వం 8మంది మంత్రులతో ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికే వివిధ ఆశ్రమాల్లో ఉన్న అనాధలకు ఎంతో నాణ్యమైన ఆహారం అందించటంతోపాటు పరిశుభ్రమైన వాతావరణంలో వసతి, విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. ఇంకా అనాధ పిల్లలకోసం చేపట్టవలసిన చర్యలపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆశ్రమం ఆవరణంలో మొక్కలు నాటారు.