న్యూఢిల్లీ : అయోధ్య రామాలయం కింది అంతస్తు నిర్మాణం తుది దశలు పూర్తికావచ్చాయి. అనుబంధ నిర్మాణాలు వచ్చే అక్టోబర్ నాటికి పూర్తి అయ్యేలా వేంగా పనులు సాగుతున్నాయి. కింది అంతస్తు నిర్మాణ పనులను ఇటీవలనే నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రాతోసహా ట్రస్టు సీనియర్ సభ్యులు సమీక్షించారు. సమీక్షలో లార్సన్ అండ్ టోబ్రో అండ్ టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్, శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మాణ పురోగతిని రోజూ పర్యవేక్షిస్తున్నారు. ఆలయ పునాది, దూలాలు, తదితర నిర్మాణాలు రాజస్థాన్ బన్సీ పహార్‌పూర్ రాతి కట్టడాలు ఇవన్నీ శరవేగంగా పూర్తిస్థాయిలో జరుగుతున్నాయన్నారు. పవిత్రమైన గర్భగుడి నిర్మాణంతోపాటు గుడ్ మండపం, రంగ్ మండపం, నృత్యమండపం, ప్రార్థనా మండపం కీర్తన మండపం తదితర ఐదు మండపాలు ఉంటాయి.
ఐదు మండపాల గోపురాల సైజు వెడల్పు 34 అడుగులు, పొడవు 32 అడుగులు ఉంటాయి. ఎత్తు 69 అడుగుల నుంచి 111 అడుగుల వరకు ఉంటుంది. మొత్తం ఆలయం పొడవు 380 అడుగులు కాగా, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగుల వరకు ఉంటుంది. గర్భగుడి పూర్తిగా మక్రానా చలువరాయి స్తంభాలు, దూలాలు, సీలింగ్ , గోడల పేర్పుతో ఉంటుంది. బరువు, వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని 392 స్తంభాలను నిర్మిస్తున్నారు. గర్భగుడి తలుపులు బంగారు నగిషీతో తయారు చేస్తున్నారు. ఆలయం, ప్రహరీ గోడ నిర్మాణం కలుపుకుని మొత్తం విస్తీర్ణం 8.64 ఎకరాల్లో నిరాణాలు సాగుతున్నాయి. ఆరు ఆలయాలను కలుపుకుని ఉండేలా భక్తుల పరిక్రమకు వీలు కల్పించేలా ప్రహరీ గోడ 762 మీటర్ల పొడవున నిర్మిస్తున్నారు.