Monday, December 23, 2024

ఎఐతో 30 కోట్ల ఉద్యోగాలకు ముప్పు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్ చాట్ జిపిటి, గూగుల్ బార్డ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ)లు వేగంగా విస్తరించేందుకు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఎఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టూల్స్ వల్ల ఉద్యోగులకు భారీ ముప్పు పొంచి ఉందని గోల్డ్‌మన్ శాచ్స్ అంచనా వేసింది. ఎఐ టెక్నాలజీ వల్ల 30 కోట్ల ఉద్యోగాలపపై ప్రభావం పడనుందని గోల్డ్‌మన్ శాచ్స్ అంచనా వేసింది. ‘ఆర్థిక వృద్ధిపై కృత్రిమ మేధ ప్రభావాల ముప్పు’ పేరిట ఈ సంస్థ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం, 30 కోట్ల ఉద్యోగాలు జనరేటివ్ ఎఐ ద్వారా ప్రభావితం అవుతాయి. మూడింట రెండొంతుల జాబ్‌లను ఎఐ భర్తీ చేస్తుంది. పారిపాలన, న్యాయ రంగాలపైనా ప్రభావం చూపుతుందని, గ్లోబల్ ఆర్థిక వృద్ధి ఎఐ దోహదం చేస్తుందని నివేదిక తెలిపింది. అమెరికా, యురోపియన్ యూనియన్‌లో కనీసం మూడింట రెండు వంతుల ఉద్యోగాలు ఎఐ ఆటోమేషన్ వల్ల ప్రమాదంలో ఉన్నాయి. అలాగే ఎఐ తన హామీ మేరకు సామర్థ్యాలను అందజేస్తే లేబర్ మార్కెట్ గణనీయమైన అంతరాయాన్ని ఎదుర్కొనే అవకాశముంది.

జెనరేటివ్ ఎఐ ప్రస్తుత పనిలో నాలుగింట ఒక వంతు చేయగలదు. ఎఐ వల్ల సాంకేతిక పురోగతితో కొత్త ఉద్యోగాలు, ఉత్పాదకత పెరుగుదలకు దారితీస్తుందని కూడా నివేదిక పేర్కొంది. అలాగే, ఇది ప్రపంచ జిడిపిని 7 శాతం వరకు పెంచగలదు. చాట్‌జిపిటి వంటి ఉత్పాదక ఎఐ వ్యవస్థలు మానవ ఉత్పత్తిని అనుకరించే కంటెంట్‌ను సృష్టించగలవని, రాబోయే దశాబ్దంలో ఉత్పత్తి వృద్ధికి దారితీయవచ్చని నివేదిక పేర్కొంది. యంత్ర యుగం కంటే కృత్రిమ మేధ మానవులకు పెద్ద ముప్పు అని చాలా మంది భావిస్తున్నారని నివేదిక పేర్కొంది. అలాగే, ఇది ఆర్థిక అసమానతను పెంచే అవకాశం ఉంది.

భవిష్యత్తులో ఉపాధి తగ్గవచ్చు 

నేడు దాదాపు 60 శాతం మంది ఉద్యోగులు చేస్తున్న పనులు 1940లో ఉనికిలో లేవని నివేదిక తెలిపింది. అయితే ఇది 1980ల నుండి వచ్చిన సాంకేతిక మార్పుతో ఉద్యోగాల సృష్టి జరగ్గా, స్థానభ్రంశం దానికంటే వేగంగా చోటుచేసుకుంది. నివేదిక ప్రకారం, కృత్రిమ మేధ మునుపటి సమాచార సాంకేతికత వలె అభివృద్ధి చెందినట్లయితే, సమీప భవిష్యత్తులో అది ఉపాధిని తగ్గించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News