Monday, April 14, 2025

గోండ్వానా యోధుడు రాంజీగోండు

- Advertisement -
- Advertisement -

భారత ప్రథమ స్వాతంత్య్ర పోరాటం అంటేనే సహజంగా స్ఫురించేది 1857 సిపాయిల తిరుగుబాటు. మధ్య భారతదేశంలో గోండ్వానా ప్రాంతంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల (గోండుల) నాయకత్వంలోని రాంజీగోండు అధ్వర్యంలో ‘రోహిల్లా తిరుగుబాటు’ (183860), కుమరంభీమ్ చేసిన ‘జోడేఘాట్ తిరుగుబాటు’ (193840) దేశంలో ఆదివాసీ తొలి చారిత్రక పోరాటాలుగా నిలిచాయి. రాంజీగోండు స్మరణకు ఆనవాళ్ళు కూడా లేకపోవడం పాలకుల వివక్షకు దర్పణం. మధ్య భారతంలోని మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసించే అనేక మంది గిరిజన తెగలలో ప్రధానమైనది గోండు. మధ్యప్రదేశ్ నివసించే గోండులలో మురియాగోండ్, మారియా గోండు ఉపతెగలు కాగా, మహారాష్ట్ర, ఆంధ్ర, ఒడిశాల్లో రాజ్ గోండ్, దుర్వగోండ్ ఉపతెగలుగా ఉన్నాయి. వీరినే ‘కోయత్తోర్’గా కూడా పిలుస్తారు.

గోండుల పరిపాలన క్రీ.శ. 1240 -1750 వరకు సుమారు ఐదు శతాబ్దాలు సాగింది. గోండ్వానా రాజ్యాన్ని భీం బలాల్ సింగ్ వార్జా నది పక్కన ఉన్న సిర్పూర్ (టీ)ను రాజధానిగా చేసుకొని పాలించాడు. తర్వాత అతని వారసులుగా బలాల్ సంగ్, హెర్సింగ్, తల్వర్ సింగ్, కేర్ సింగ్, రాంసింగ్, సూర్ణా బలాల్ సింగ్ గోండ్వానా రాజులుగా పరిపాలన సాగించారు.సూర్జా బలాల్ సింగ్ ఢిల్లీ సుల్తానుల సైన్యంతో యుద్ధంచేసి విజయం సాధించారు. సుల్తానులు గోండ్వానాలోని దక్షిణ మండల ప్రాంతాన్ని షేర్ ‘షా’ బిరుదును గోండుల తొలి బలాల్ సింగ్‌కు కానుకగా ఇచ్చారు. అందుకే గోండురాజులు తమ పేరు చివర సింగ్‌కు బదులుగా ‘షా’ పెట్టుకున్నారు.

బలాల్ సింగ్ తనయుడు ఖందియా బలాల్ షా రాజధానిని సిర్పూర్ (టి) ముర్తి చంద్రాపూరుకు మార్చాడు. తొమ్మిది మంది గోండు రాజులలో చివరివాడైన నీల్ కంఠ షా ను మరాఠీలు బందీచేసి చంద్రాపూర్‌ను ఆక్రమించుకున్నారు. దీంతో గోండ్వానా ప్రాంతం క్రీ.శ. 1750-1802 వరకు మరాఠీల ఆధీనంలోకి వెళ్ళింది.మరాఠీ రాజులు బ్రిటిష్‌వారికి తలొగ్గి గోండ్వానాను తెల్లదొరలకు అప్పగించారు. దీంతో గోండుల పాలన అంతమై ఆంగ్లేయుల, నైజాంల పాలన ఆరంభమైంది. ఆదిలాబాద్ జిల్లాలోని గోండుల్లో ధైర్యశాలిగా పేరున్న మార్సికోల్ల రాంజీగోండ్ 1838- 1880 మధ్యకాలంలో నాటి జనగాం (ఆసిఫాబాద్) కేంద్రంగా చేసుకొని బ్రిటిష్ సైన్యాలను దీటుగా ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాటయోధుడు. బ్రిటిష్ సైన్యంతో ఎదురొడ్డి వీరమరణం పొందిన ఝాన్సీ లక్ష్మీబాయి, ఆ తదుపరి నానాసాహెబ్, తాంతియా తోపే, రావు సాహెబ్‌లు తమ బలగాలతో విడిపోయారు. తాంతియా తోపే నర్మదానది దాటి హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించే ప్రయత్నంలోనే నైజాం నవాబుల వల్ల తాంతియా తోపే తమ గమ్యాన్ని మార్చుకున్నారు.

తోపే అనుచరగణం రోహిల్లా సిపాయిలు పెద్ద సంఖ్యలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ, ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించారు. రోహిల్లా సిపాయిలు అజంతా, బస్మత్, లాథూర్, మఖ్తల్, నిర్మల్ ప్రాంతాలను పోరాట కేంద్రాలుగా చేసుకున్నారు. రోహిల్లాల నాయకుడిగా ప్రకటించుకున్న రంగారావు నిజాం ప్రభుత్వాన్ని, బ్రిటిష్ వాళ్లను తరిమేసేందుకు పూనుకున్నాడు. సైనిక బలగాల శిక్షణలో భాగంగా ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసే క్రమంలో బ్రిటిష్ సైన్యానికి పట్టుబడ్డారు. యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ రంగారావు అండమాన్ జైలులో1860లో మరణించాడు. ఆ తర్వాత రోహిల్లాల తిరుగుబాటు రాంజీ గోండ్ నాయకత్వంలో తీవ్రరూపం దాల్చింది. రోహిల్లా సిపాయిల తిరుగుబాటు ప్రధానంగా అసిఫాబాద్ తాలూకా నిర్మల్ కేంద్రంగా జరిగింది. అది ప్రధానంగా గోండులు, కోలాము, కోయతెగల గిరిజనులుండే ప్రాంతం. రాంజీ గోండ్ సారథ్యంలో రోహిల్లా సిపాయిల తిరుగుబాటుగా మారింది.

బ్రిటిష్ రోహిల్లాల మధ్య తిరుగుబాటు తుది కీలక ఘట్టం 1880 మార్చి, ఏప్రిల్లో జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం గోండుల తిరుగుబాటును అణచివేసే బాధ్యతను కల్నల్ రాబర్ట్‌కు అప్పజెప్పింది. బ్రిటిష్ వారి ఆకృత్యాలతో గోండు గిరిజనులు బానిస బతుకులు వెళ్ళదీశారు. తెల్లదొరల నిర్బంధాన్ని వ్యతిరేకించడం, వెట్టికి ప్రతిఫలం ఆశించడాన్ని తెల్లదొరలు సహించలేకపోయారు. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, లక్సెట్టిపేట, ఉట్నూర్, జాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాలు బ్రిటిష్ వారి దౌర్జన్యంతో అల్లకల్లోలంగా మారాయి. రాంజీ నాయకత్వంలో రోహిల్లాలతో పాటు 500 పైగా గోండులు పులిబెబ్బులులై విల్లంబులు, బరిసెలు, తల్వార్లు ధరించి కదనరంగానికి సిద్ధమయ్యారు. వెయ్యి మంది రోహిల్లాలు, గోండులు కలిసి నిర్మల్ సమీప కొండలను కేంద్రంగా చేసుకొని పోరాటం చేశారు.

నిర్మల్ సమీప కొండలను స్థావరంగా చేసుకొని పోరాడుతున్న వారిపై నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు వారిపై దాడులు చేశాయి. అడవంతా తుపాకులమోతతో మారుమోగింది. సంప్రదాయక ఆయుధాలతో పోరాటానికి దిగిన ఆదివాసులు ఆధునిక ఆయుధాలు, తుపాలకుల ముందు నిలువలేకపోయారు. తెగించి పోరాడుతున్న ఆదివాసులను కాల్చిచంపారు. కడదాకా పోరాడిన రాంజీగోండు సహా 1000 మందిని పట్టుకొని నిర్మల్ నడిబొడ్డున ఉన్న ‘ఊడలమర్రి’ చెట్టుకు 1880 ఏప్రిల్ 9న ఉరితీశారు. ఆ మర్రిచెట్టు ఇప్పుడు ‘వెయ్యి ఉరిల మర్రిచెట్టు’ గా ప్రసిద్ధి. అలాగే ఆ చెట్టు అమాయక అడవిబిడ్డల ఆర్తనాదాలను, బ్రిటిష్ నిరంకుశత్వాన్ని ఛేదించిన వైనాన్ని అణువణువునా జీర్ణించుకొని ఉంది.

(నేడు రాంజీ గోండ్ 145 వ వర్ధంతి)

గుమ్మడి లక్ష్మీనారాయణ
94913 18409

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News